భారతీయ పురాణ, ఇతిహాసాలను తెరకెక్కించడంలో తెలుగువారు మేటి అనిపించుకున్నారు. అందునా నటరత్న యన్.టి.రామారావు నటించిన అనేక పౌరాణిక చిత్రాలు ఆబాలగోపాలానికి పురాణాల్లో దాగిన పలు అంశాలను విప్పి చెప్పాయి. అలాంటి చిత్రమే ‘శ్రీకృష్ణాంజనేయ యుద్ధం’. నిజానికి ఈ కథ పురాణాల్లో కనిపించక పోయినా, శ్రీరాముడు వైకుంఠయానం చేసేటపుడు ఆంజనేయుడు ఎక్కడ ఉన్నాడు? ఉంటే తనతో పాటు తన భక్తుని తీసుకువెళ్ళేవాడు కదా అనే వాదన ఉన్నది. అందునిమిత్తమై, రామాయణంలోని కొన్ని అంశాలను ఆంజనేయునికి రాముడే దేశబహిష్కరణ విధించేలా ఓ కథను మలిచారు. ఆంజనేయుడు చిరంజీవి కావున, ద్వాపరయుగంలోనూ ఉంటాడు. భీమునితో తలపడతాడు అనే గాథ వినిపిస్తుంది. అలా పలు అంశాలు ఆధారంగా ద్వాపరయుగంలో శ్రీకృష్ణునిగా అవతరించిన శ్రీమహావిష్ణువుతో రామభక్తుడైన హనుమంతుడు తలపడ్డాడని ఓ నాటకం రూపొందించారు. అంతకు ముందే యయాతి సంరక్షణ కోసమై తన ప్రభువైన శ్రీరామునితోనే హనుమంతుడు తలపడినట్టుగా ‘శ్రీరామాంజనేయ యుద్ధం’ అనే నాటకం మరొకటి ఉంది. ఈ రెండు నాటకాలు తెలుగునాట సుప్రసిద్ధాలు. ఈ రెండు నాటకాల ఆధారంగా రూపొందిన ‘శ్రీరామాంజనేయ యుద్ధం’, ‘శ్రీకృష్ణాంజనేయ యుద్ధం’ చిత్రాలలో యన్టీఆర్ నటించడం విశేషం! కాకపోతే ముందుగా ‘శ్రీకృష్ణాంజనేయ యుద్ధం’ వెలుగు చూసింది. ఈ సినిమా 1972 మే 18న జనం ముందు నిలచింది. ఈ చిత్రంలో శ్రీకృష్ణునిగా యన్టీఆర్, ఆంజనేయునిగా రాజనాల నటించారు.
‘శ్రీకృష్ణాంజనేయ యుద్ధం’లోని కథాంశమేమంటే- శ్రీరామచంద్రునికి, లవకుశులను అప్పచెప్పి, భూమాత ఒడిలోకి ఒదిగిపోయిన సీతను మరువలేక శ్రీరాముడు వ్యధతో ఉంటాడు. వశిష్ఠునితో తన ప్రభువు బాధ తీర్చమంటాడు ఆంజనేయుడు. ఆయన బాధను మరొకరు పంచుకోగలిగితే అది సాధ్యమని సెలవిస్తాడు వశిష్ఠుడు. ఓ బ్రాహ్మణోత్తముని ప్రార్థన విని, ఆయన ద్వారా తనకు మనశ్శాంతి కలుగుతుందేమో తోడ్కొని రమ్మంటాడు రాముడు. హనుమంతుడు అలాగే చేస్తాడు. ఏకాంతంలో మాట్లాడాలని వచ్చిన బ్రాహ్మణుడు కోరతాడు. ఒకవేళ కాదని ఎవరైనా వస్తే, వారికి శిరచ్ఛేదమే తగిన శిక్ష అని చెబుతాడు. ఆ వచ్చిన వ్యక్తి యమధర్మరాజు. శ్రీరామావతారం చాలించమని, వైకుంఠంలో లక్ష్మీదేవి తమ రాకకోసమై వేచి ఉందని చెబుతాడు. ఈ సంభాషణ జరుగుతూ ఉండగా దుర్వాసుడు వస్తాడు. రాముని చూడాలంటాడు. అందుకు హనుమ వీలు కాదని చెబుతాడు. దాంతో రఘువంశాన్నే శపిస్తానంటాడు దుర్వాసుడు. భయపడి హనుమంతుడు రాముని వద్దకు వెళతాడు. నియమభంగం చేసిన హనుమకు శిరచ్ఛేదం అంటారు. వశిష్ఠుడు వచ్చి, దేశబహిష్కరణ శిరచ్ఛేదం కన్నా మిన్న అని చెప్పి మారుతిని పంపిస్తాడు. ఆ పై రామావతారం చాలించిన శ్రీమహావిష్ణువు ద్వాపరలో శ్రీకృష్ణునిగా వైభవం చూస్తూంటాడు. శ్రీకృష్ణుని అన్న బలరాముడు, కృష్ణుని వాహనమైన గరుత్మంతుడు ఎవరికి వారు తామే మహాబలవంతులమని విర్రవీగుతూ ఉంటారు. వారికి ఆంజనేయుని ద్వారా గర్వభంగమవుతుంది. శ్రీరాముడే ఈ యుగంలో శ్రీకృష్ణునిగా జన్మించాడని నారదుడు, ఆంజనేయునికి చెబుతాడు. అయినా హనుమ విశ్వసించడు. తన రాముడొక్కడే దేవుడని అంటాడు. బలరాముని పడగొట్టి లాభం లేదని, ఆ శ్రీకృష్ణునే ఓ పట్టు పట్టమని నారదుడు చెబుతాడు. దాంతో ఆంజనేయుడు ద్వారక వెళతాడు. అక్కడ ఆంజనేయుని ఆపుటకు సీతలా నారదుస్తులు ధరించి, సత్యభామ తానే సీతనని అంటుంది. ఆమె సీతమ్మ తల్లి కాదని ఆంజనేయుడు ఇట్టే కనిపెట్టేస్తాడు. తరువాత శ్రీకృష్ణుడినే చూస్తాడు. వాగ్యుద్ధానికి దిగుతాడు. తన శ్రీరామచంద్రుడే గొప్పఅని వాదులాడతాడు. శ్రీకృష్ణునిపైకే గదతో దూకుతాడు. చివరకు రుక్మిణి వచ్చి, ‘హనుమా… మన ప్రభువు పైకే యుద్ధమునకు దిగితివా…’ అని ప్రశ్నిస్తుంది. దాంతో అతని మాయపొరలు తొలగి, శ్రీకృష్ణునిలోనే శ్రీరాముని చూసి తరిస్తాడు. ఏమి వరం కావాలో కోరుకోమని శ్రీకృష్ణుడు కోరగా, ఆంజనేయుడు భరతావనిలో శ్రీరామరాజ్యం వెలసిల్లాలని ఆశించడంతో కథ ముగుస్తుంది.
పూర్ణిమ పిక్చర్స్ పతాకంపై డి.యన్.రాజు నిర్మించిన ఈ చిత్రానికి సి.యస్.రావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో దేవిక, వాణిశ్రీ, ఎస్వీరంగారావు, కాంతారావు, రాజబాబు, చిత్తూరు వి.నాగయ్య, ధూళిపాల, మిక్కిలినేని, ముక్కామల, ఆర్జా జనార్దనరావు, త్యాగరాజు, శాంతకుమారి, హేమలత, రోజారమణి, సంధ్యారాణి, లీలారాణి, విజయభాను, వై.విజయ, మాస్టర్ రాము తదితరులు నటించారు.
టి.వి.రాజు స్వరకల్పన చేసిన ఈ చిత్రానికి సి.నారాయణ రెడ్డి, సముద్రాల జూనియర్ పాటలు రాశారు. “రామా రఘురామా…”, “నీవైన చెప్పవే ఓ మురళీ…”, “గోపాల కృష్ణ జయహో…”, “చిక్కని గోపాలకృష్ణుడు…”, “రామలీల…”, “హరే రామ హరే కృష్ణ…” అంటూ సాగే పాటలు అలరించాయి.
తాండ్ర సుబ్రహ్మణ్యం రాసిన ‘శ్రీకృష్ణాంజనేయ యుద్ధం’ నాటకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. సముద్రాల జూనియర్ మాటలు రాశారు. తాండ్ర సుబ్రహ్మణ్యం రాసిన పద్యాలనే సమయోచితంగా ఉపయోగించుకున్నారు. శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రల పోషణలో తనకు తానే అనిపించుకున్నారు యన్టీఆర్. ఇందులోనూ ఆయన అభినయం అలాగే సాగింది. నిజజీవితంలో ఆంజనేయ భక్తుడైన రాజనాల ఇందులో హనుమంతుని పాత్రలో అలరించారు. సత్యభామ పాత్రలో వాణిశ్రీ ఎంతగా నటించినా, ఆకట్టుకోలేక పోయారనే చెప్పాలి. రిపీట్ రన్స్ లో ‘శ్రీకృష్ణాంజనేయ యుద్ధం’ ప్రేక్షకులను మురిపించింది.