తెలుగు చిత్రసీమలో స్టార్ డమ్ కోసం పలు సంవత్సరాలు పాట్లు పడిన చరిత్ర శోభన్ బాబుది. దాదాపు పుష్కరకాలానికి ‘తాసిల్దార్ గారి అమ్మాయి’ విజయంతో స్టార్ అనిపించుకున్నారు శోభన్ బాబు. అప్పటి దాకా యన్టీఆర్, ఏయన్నార్ చిత్రాలలో సైడ్ హీరోగా నటించారు. ఒక్కసారి విజయం రుచి చూసిన తరువాత శోభన్ బాబు సైతం అదే తీరున విజృంభించారు. తరువాత “చెల్లెలికాపురం, అమ్మమాట, సంపూర్ణ రామాయణం” వంటి విలక్షణమైన చిత్రాలు, విజయాలూ శోభన్ ను పలకరించాయి. ఆ పై వచ్చిన ‘మానవుడు- దానవుడు’ చిత్రంలో శోభన్ బాబు అభినయం మరింత విలక్షణంగా సాగింది. జనాన్ని భలేగా అలరించింది. 1972 జూన్ 23న విడుదలైన ‘మానవుడు-దానవుడు’ అనూహ్య విజయం సాధించింది.
కథ విషయానికి వస్తే – చిన్నతనంలోనే పేదరికం అనుభవించే వేణు అక్క సీతను భుజంగం అనే వాడు మానభంగం చేస్తాడు. భుజంగం అమాయకులైన అమ్మాయిలతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తూ ఉంటాడు. దిక్కులేని వేణుకు ఓ బాబా ఆశ్రయమిస్తాడు. కష్టపడి చదువుకొని డాక్టర్ అవుతాడు వేణు. భుజంగం కూతురు రాధాదేవి, వేణును ప్రేమిస్తుంది. సమాజంలో కొందరు దుర్మార్గుల వల్ల బలైపోతున్న అబలలను రక్షించేందుకు జగన్ అనే వ్యక్తి బయలు దేరతాడు. అమ్మాయిలను రక్షించడంలో ఎందరో దుర్మార్గుల కీళ్ళు విరుస్తుంటాడు. వాళ్లందరికీ డాక్టర్ వేణు వైద్యం చేస్తూ ఉంటాడు. కులం, మతం అన్నవి లేవని, మనుషులంతా ఒక్కటేననే ఆదర్శ భావాలతో డాక్టర్ వేణు సాగుతూ ఉంటాడు. అతని చెంతనే రాధ కూడా చేరుతుంది. వేణు అక్క సీత ఓ పాపకూపంలో చిక్కుకొని ఉంటుంది. ఆమెను, ఆమెతో పాటు మరికొందరిని జగన్ బంధవిముక్తులను చేస్తాడు. సీతకు, వేణు ఆసుపత్రిలోనే సేవ చేసుకొనే అవకాశం లభిస్తుంది. ఎదురుగా తమ్ముడే ఉన్నా పిలుచుకోలేక ఆవేదన చెందుతుందామె. భుజంగంతో జగన్ చేతులు కలుపుతాడు. డాక్టర్ వేణునూ ప్రేమిస్తున్న రాధ విషయం తెలిసి, అతణ్ని చంపే పని జగన్ కు అప్పగిస్తాడు భుజంగం. అది పూర్తి చేశాక, రాధపై మనసు పారేసుకుంటాడు జగన్. భుజంగం కళ్ళ ముందే అతని కూతురును మానభంగం చేయబోతాడు. తట్టుకోలేని భుజంగం తన కారణంగా ఆమె బలికాకూడదని చేసిన పాపాలు అంగీకరిస్తాడు. వాటిని రికార్డ్ చేసి, పోలీసులకు అందజేసి, వాడు చట్టానికి లొంగేలా చేస్తాడు జగన్. అందరూ చనిపోయాడనుకుంటున్న వేణును తానే అని జగన్ నిజరూపం చూపిస్తాడు. వేణు, రాధ ఒకటవ్వడంతో కథ సుఖాంతమవుతుంది.
ఉషఃశ్రీ ప్రొడక్షన్స్ పతాకంపై పి.చిన్నప రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయనే ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లేను సమకూర్చడం విశేషం! పి.చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శోభన్ బాబు, శారద, సత్యనారాయణ, రాజబాబు, కృష్ణకుమారి, ముక్కామల, పి.జె.శర్మ, జయకుమారి, జ్యోతిలక్ష్మి, అర్జా జనార్దనరావు నటించారు. అతిథి పాత్రల్లో కృష్ణంరాజు, కె.వి.చలం, మీనా కుమారి, ఏడిద నాగేశ్వరరావు కనిపించారు. మోదుకూరి జాన్సన్ మాటలు రాసిన ఈ చిత్రానికి సి.నారాయణ రెడ్డి, దాశరథి, మోదుకూరి జాన్సన్, ఉషఃశ్రీ పాటలు పలికించారు. అశ్వథ్థామ సంగీతం సమకూర్చారు. ఇందులోని “పచ్చని మన కాపురం… “, “అమ్మాలాంటి చల్లనిది…”, “కొప్పు చూడు కొప్పందం చూడు… ” , “ఎవరు వీరు…” వంటి పాటలు అలరించాయి. అన్నిటినీ మించి “అణువూ అణువున వెలసిన దేవా…” పాట ఎంతగానో ఆదరణ పొందింది. ఈ పాట ఇప్పటికీ జాతీయ పర్వదినాలలో మన వీనులకు విందు చేస్తూనే ఉంది.
‘మానవుడు- దానవుడు’ సినిమా అనూహ్య విజయం సాధించింది. ఆరు కేంద్రాలలో శతదినోత్సవం చూసింది. ఆ రోజుల్లో శోభన్ బాబుకు ఇదో పెద్ద హిట్ కిందే లెక్క. వసూళ్ళ పరంగానూ నాటి మేటి హీరోల స్థాయిలో ‘మానవుడు-దానవుడు’ పోగేయడం విశేషం! ఈ చిత్రాన్ని తమిళంలో శివాజీగణేశన్ హీరోగా ‘ఎంగల్ తంగ రాజా’ పేరుతో మన తెలుగు నిర్మాత వి.బి.రాజేంద్ర ప్రసాద్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. అక్కడా ఈ కథ విజయం సాధించింది. తరువాత హిందీలో వినోద్ ఖన్నా హీరోగా మన తెలుగు నిర్మాత డూండీ స్వీయ దర్శకత్వంలో ‘ఆధా దిన్ ఆధీ రాత్’ పేరుతో నిర్మించారు. ఆ పై మళయాళంలో మధు, శారద జంటగా ‘ఇదానేంటే వళి’ పేరుతో తెరకెక్కించారు. ఆ తరువాత శోభన్ బాబు కాసింత నెగటివ్ టచ్ ఉన్న కేరెక్టర్స్ లో నటిస్తే, ఆ పాత్రలకు జగన్ అని పేరు పెట్టేవారు. ఆ పై శోభన్ బాబు హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘జగన్’ అనే సినిమా రూపొందింది. అలా శోభన్ ను జగన్ గా జనం ముందు నిలిపిన చిత్రంగా ‘మానవుడు-దానవుడు’ నిలచింది.