కథలు కొత్తవి కనిపించక పోతే, పాత కథలనే కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తుంటారు మన దర్శకనిర్మాతలు. అలా తెలుగు చిత్రసీమలో పలు పాత కథలే కొత్తగా కనిపించే ప్రయత్నం చేశాయి. వాటిలో కొన్ని ఘనవిజయాలు సైతం సాధించాయి. తన చిత్రాలనే మళ్ళీ కాలానుగుణంగా మార్పులూ చేర్పులూ చేసి ప్రేక్షకులను రంజింప చేశారు దిగ్దర్శకుడు చిత్తజల్లు పుల్లయ్య. 1934లో సి.పుల్లయ్య దర్శకత్వంలో రూపొందిన ‘లవకుశ’ తెలుగు చిత్రసీమలో తొలి బిగ్ హిట్ గా నిలచింది. ఆ సినిమానే మరో 29 ఏళ్ళకు అదే సి.పుల్లయ్య 1963లో రంగుల ‘లవకుశ’గా తీర్చిదిద్ది, అనూహ్య విజయం సాధించారు. ‘లవకుశ’ స్థాయిలో ఇప్పటి దాకా దక్షిణాదిన ఘనవిజయం సాధించిన పౌరాణికం మరొకటి కానరాదు. అదే తీరున తాను 1947లో రూపొందించిన ‘గొల్లభామ’ చిత్రాన్ని మరో ఇరవై ఏళ్ళ తరువాత ‘భామావిజయం’గా మలచి జనాన్ని ఆకట్టుకున్నారు సి.పుల్లయ్య. చిత్రమేమిటంటే, సి.పుల్లయ్య తన హిట్స్ ను రీమేక్ చేసిన ఈ రెండు చిత్రాలలో నటరత్న యన్.టి.రామారావునే కథానాయకునిగా ఎంచుకోవడం. అలా ‘బామావిజయం’లోనూ యన్టీఆర్ హీరోగా నటించారు. దేవిక నాయికగా నటించిన ఈ చిత్రం 1967 జూన్ 29న విడుదలయి విజయం సాధించింది.
సి.పుల్లయ్య దర్శకత్వంలో రూపొందిన ‘గొల్లభామ’లో కృష్ణవేణి నాయికగా నటించగా, ఈలపాట రఘురామయ్య ఆమెకు జోడీగా నటించారు. ఆ చిత్రంలో ప్రధాన కథ అంతా గొల్లభామపైనే తిరుగుతుంది. ‘భామావిజయం’లో కథానాయకుడు యన్టీఆర్ కావడంతో, ఆయన ప్రధానాంశంగా మారారు. కథాంశం మాత్రం ఒక్కటే! “భూపతి చంపితిన్, మగడు భూరిభుజంగము చేత చచ్చే నే – నాపద చెంది చెంది ఉదయార్కుని పట్టణమేగి, వేశ్యనై – పాపము కట్టుకొంటి, అట పట్టి విటుండైరాగచూసి, సం- తాపము చెంది అగ్ని పడి దగ్ధముగా కిటు గొల్లభామనై – ఈ పని కొప్పుకొంటి నృపతీ వగపేటికి చల్లచిందినన్’’- ఈ ‘భామావిజయం’ కథ మొత్తం ఈ పద్యంలోనే దాగి ఉంది. ఓ గురువు, ఆయన శిష్యుడు బడలిక తీర్చుకోవడానికి ఓ వటవృక్షం దగ్గర సేదతీరుతారు. అక్కడే ఓ గొల్లభామ బొమ్మ చెక్కి, దాని కింద పైన ఉదహరించిన పద్యం చెక్కబడి ఉంటుంది. దానిని చదివిన శిష్యుడు, ఆ కథ ఏమిటో చెప్పమంటాడు. అందుకు గురువు సావధానంగా చెప్పడంతో ‘భామావిజయం’ కథ మన కళ్ళ ముందు నిలుస్తుంది.
సుందరి అనే అందమైన అడవిపిల్లను భూపతి చెరచబోతాడు. వాడిని చంపి పారిపోతున్న సుందరిని జయచంద్రుడనే రాజకుమారుడు రక్షిస్తాడు. ఆమె అందచందాలకు జయచంద్రుడు సైతం ఆకర్షితుడై, ప్రేమిస్తాడు. సుందరి సైతం జయచంద్రుని ఆరాధిస్తుంది. జయచంద్రుడు తన కన్నవారికి సుందరి కథ చెప్పి, ఆమెను వారి అంగీకారంతో వివాహమాడతాడు. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్న సమయంలో మోహినీ, వాహినీ అనే దేవకన్యలు జయచంద్రుని అందం చూసి మత్తెక్కి అతడు నిద్రిస్తూండగా తమ దేవలోకం తీసుకు వెళతారు. అక్కడ వారి అందచందాలతో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తారు. కానీ, సుందరిని తప్ప అన్యమెరుగనని చెప్పగా, సుందరిని సైతం అక్కడకు తెస్తారు. భార్యాభర్తలిద్దరూ అమృతం సేవించి, ఆనందంగా జీవనం సాగిస్తారు. తరువాత సుందరిని భూలోకం పంపి, మోహిని తన ఆటపాటలతో జయచంద్రుని వశం చేసుకుంటుంది. భూలోకంలో భర్తలేకుండా తల్లి అయిన సుందరిని అందరూ అనుమానిస్తారు. ఆమెకు రాజు శిరచ్ఛేదం విధిస్తాడు. ఆమె అమృతం తాగడం వల్ల కత్తులు ఏమీ చేయలేవు. దాంతో భటులు ఆమెను పతివ్రతగా భావించి, అడవిలో వదిలేస్తారు. అక్కడ నుంచీ సుందరి పలు కష్టాలు పడుతుంది. ఓ బిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డ తప్పిపోయి, ఓ రాజదంపతులకు లభిస్తాడు. తరువాత ఓ వేశ్య గృహంలో తలదాచుకుంటుంది సుందరి. ఎన్నో ఏళ్ళు గడచినా, సుందరి తన వ్రతభంగం కాకుండా వేశ్య ఇంటనే పవిత్రంగా ఉంటుంది. అయితే కొన్నేళ్ళ తరువాత రాజ దంపతుల వద్ద పెరిగిన ఆమె కొడుకే నవయువకుడై ఆమె అందానికి ఆకర్షితుడవుతాడు. రాకుమారుని మిత్రుడు వేశ్య గృహానికి వెళ్ళి, ఎలాగైనా ఆమెను ఒప్పించి, తమ రాజకుమారునికి అప్పగించమంటాడు. భయపడ్డ వేశ్య, సుందరికి ఈ విషయం చెబుతుంది. ఎలాగైనా ఇన్నాళ్ళు నీకు రక్షణ ఇచ్చిన మమ్మల్ని కాపాడమంటుంది. ఆమె సరే అంటుంది. సాయంకాలం రాకుమారుడు వస్తూ, దారిలో ఓ దూడ తోక తొక్కుతాడు. ఆ రాకుమారునికి పలు భాషలు తెలుసు. అలాగే జంతు భాష కూడా వచ్చి ఉంటుంది. గోవు, దూడ మాటల్లో ఆ వేశ్య ఇంట ఉన్న ఆమెనే తన తల్లి అని తెలుసుకుంటాడు. ఆమెను ‘అమ్మా’ అనగానే సుందరి యెద పొంగి తల్లిప్రేమ చిలుకుతుంది. వేశ్య, సుందరి మోసం చేసిందని భావిస్తుంది. ఆ ఇంట నుండి బయట పడ్డ సుందరి ఓ గొల్లవారి ఇంట తలదాచుకుంటుంది. నెత్తిన పాలు, పెరుగు, నెయ్యి పెట్టుకొని అమ్మబోతుంది. ఆ సమయంలోనే ఆమె కొడుకు ఆమెను వెదుక్కుంటూ వస్తాడు. దేవలోకంలోని జయచంద్రునికి కూడా భార్య గుర్తుకు వస్తుంది. మోహిని, వాహిని మధ్య వైరం తలెత్తడం వల్ల అతణ్ణి భార్య దగ్గరకు వెళ్ళమని వాహిని పంపిస్తుంది. ఇంటికి వచ్చిన జయచంద్రుని చూసి అందరూ జడుసుకుంటారు. ఎందుకంటే, అతనిలో ఏ మార్పూ ఉండదు. అందరూ ముసలివారై పోయి ఉంటారు. తన భార్య ఏదని అడుగుతాడు. అందుకు జరిగిన దంతా చెబుతారు. ఆమె అమృతం తాగి ఉంది కనుక, చావు ఉండదని జయచంద్రుడు కూడా ఆమెను వెదుక్కుంటూ వెడతాడు. జయచంద్రుని గుర్రం కింద పడుతుంది సుందరి, ఎవరు నీవు అని అతడు ప్రశ్నించగా, “భూపతి చంపితి…” పద్యం పాడుతుంది. కథంతా విన్న జయచంద్రుడు ఆమె ముఖం అప్పుడు చూస్తాడు. ఆమె తన భార్యేఅని గుర్తిస్తాడు. అలాగే రాకుమారుడు కూడా వచ్చి, తన తల్లిదండ్రులను చేరుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.
ఇందులో ఎల్.విజయలక్ష్మి, విజయనిర్మల, రేలంగి, గిరిజ, రాజనాల, ముక్కామల, చిత్తూరు నాగయ్య, చదలవాడ, రాజబాబు, నాగరాజు, ఎస్.వరలక్ష్మి, ఋష్యేంద్రమణి నటించారు. ఈ చిత్రానికి టి.వి.రాజు సంగీతం సమకూర్చగా, సముద్రాల, సి.నారాయణ రెడ్డి పాటలు పలికించారు. ఇందులోని “పైరుగాలి వీచింది…”, “రా రా సుందరా…”, “రెండు చందమామలు…”, “రావే చెలీ ఓ జాబిలీ…”, “భువన మోహిని…”, “కోరినవాడే చెలీ…” అంటూ సాగే పాటలు అలరించాయి. ఈ సినిమా మంచి విజయం సాధించి, శతదినోత్సవం జరుపుకుంది.
