Fifty Five Years For Nindu Manasulu & Vasantha Sena Movie :
నటరత్న యన్టీఆర్, నటసమ్రాట్ ఏయన్నార్ సినిమాల మధ్య విపరీతమైన పోటీ ఉన్న రోజుల్లో వారిద్దరి చిత్రాలు ఒకే రోజున విడుదలై బాక్సాఫీస్ వద్ద ఢీ కొట్టిన సందర్భాలూ ఉన్నాయి. 1950 నుండి 1963 వరకు ఈ ఇద్దరు మహానటులు కలసి 11 చిత్రాలలో నటించారు. ఓ సినిమాలో యన్టీఆర్ పాత్ర నిడివి ఎక్కువగా ఉంటే, మరో చిత్రంలో ఏయన్నార్ పాత్ర ఎక్కువగా ఉండేది. అయితే ఏ రోజునా వారిద్దరూ తమ పాత్రలు ఇద్దరికీ సమానంగా ఉండాలని షరతులు విధించిలేదు. అలాంటి రామారావు, నాగేశ్వరరావు మధ్య ఓ చిన్న విషయంలో పొరపొచ్చాలు వచ్చాయి. ఆ తరువాత ఏయన్నార్ హైదరాబాద్ మకాం మార్చారు. యన్టీఆర్ అంతకు ముందే హైదరాబాద్ లో ఆస్తులు కొన్నారు. ఏయన్నార్ తన షూటింగులు హైదరాబాద్ స్టూడియోస్ లోనే జరగాలని పట్టు పట్టారు. యన్టీఆర్ మాత్రం మద్రాసు, హైదరాబాద్ అన్న తేడా లేకుండా నిర్మాత ఎక్కడ షూటింగ్ పెడితే అక్కడకు వచ్చి నటించేవారు. అంతకు ముందు ఈ ఇద్దరు మహానటుల చిత్రాలు ఒకే రోజున విడుదలయిన సందర్భాలు లేవు. అయితే 1967లో మాత్రం యన్టీఆర్, ఏయన్నార్ బాక్సాఫీస్ వార్ లో ఢీ కొన్నారు. యన్టీఆర్ ‘భువనసుందరి కథ’ 1967 ఏప్రిల్ 7న విడుదల కాగా, అదే రోజున ఏయన్నార్ ‘గృహలక్ష్మి’ విడుదలయింది. ఏయన్నార్ సినిమా పరాజయం పాలు కాగా, యన్టీఆర్ చిత్రం పరవాలేదనిపించుకుంది. దాంతో ఈ సారి కనీసం ఒకరోజయినా తేడా ఉండాలని భావించారు ఈ మహానటులు, వారి నిర్మాతలు. అదే యేడాది ఆగస్టు 10న ఏయన్నార్ నటించిన రంగుల చిత్రం ‘వసంతసేన’ను విడుదల చేయాలని నిర్ణయించారు. మరుసటి రోజు అనగా ఆగస్టు 11న యన్టీఆర్ ‘నిండుమనసులు’ను విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. చిత్రంగా ఏయన్నార్ సినిమాకు టెక్నికల్ ప్రాబ్లమ్ ఎదురయింది. దాంతో ‘వసంతసేన’ ఓ రోజు ఆలస్యంగా విడుదలయింది. అంటే యన్టీఆర్ ‘నిండుమనసులు’ విడుదల రోజునే ఏయన్నార్ ‘వసంతసేన’ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చిందన్న మాట!
శూద్రకుడు రాసిన ‘మృచ్ఛకటికం’ సంస్కృత నాటకం సుప్రసిద్ధమైనది. ఆ నాటకం ఆధారంగానే ‘వసంతసేన’ తెరకెక్కింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్, ఆర్ట్ డైరెక్టర్ బి.యస్.రంగా ఈ చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించారు. ఇక యన్టీఆర్ ‘నిండుమనసులు’ చిత్రానికి హిందీ సినిమా ‘ఫూల్ ఔర్ పత్థర్’ ఆధారం. తొలి నుంచీ రంగుల చిత్రం ‘వసంతసేన’కు మంచి క్రేజ్ లభించింది. ఇక యన్టీఆర్ ఇమేజ్ తోనే ‘నిండుమనసులు’కు బజ్ క్రియేట్ అయింది. ఈ చిత్రాన్ని యస్.డి.లాల్ దర్శకత్వంలో యమ్.జగన్నాథరావు నిర్మించారు. ‘వసంతసేన’ రంగుల చిత్రం కాబట్టి, బడ్జెట్ ఎక్కువ! అందువల్ల దానికి పోటీ ఎందుకని ‘నిండు మనసులు’ నిర్మాతనే ఓ రోజు వెనక్కు జరిగారు. అయితే ‘వసంతసేన’కు సాంకేతిక సమస్యలు ఎదురై మరుసటి రోజు కొన్ని చోట్ల, ఆ మరుసటి రోజు మరికొన్ని కేంద్రాలలో విడుదలయింది. ఈ సారి కూడా మళ్ళీ యన్టీఆర్ సినిమాదే పైచేయి అయింది. ‘నిండుమనసులు’ మంచి విజయం సాధించింది. ‘వసంతసేన’ ఆకట్టుకోలేక పోయింది. ఆ తరువాత యన్టీఆర్, ఏయన్నార్ సినిమాలు ఎన్నడూ ఒకే రోజున విడుదల కాలేదు.
ఫలితాలు… పరిణామాలు…
ఏయన్నార్ తో భరణీ పిక్చర్స్ పతాకంపై భానుమతి, ఆమె భర్త రామకృష్ణ నిర్మించిన చిత్రం ‘గృహలక్ష్మి’. ఈ సినిమా పరాజయం పాలయిన తరువాత మళ్ళీ భరణీ సంస్థలో ఏయన్నార్ నటించక పోవడం గమనార్హం! అంతకు ముందు భరణీ సంస్థలో ఏయన్నార్ “లైలా మజ్ను, ప్రేమ, రత్నమాల, విప్రనారాయణ, చక్రపాణి, బాటసారి” చిత్రాలలో నటించారు.
యన్టీఆర్ తో ‘భువనసుందరి కథ’ చిత్రాన్ని సి.పుల్లయ్య దర్శకత్వంలో తోట సుబ్బారావు నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరవాలేదనిపించుకుంది. రిపీట్ రన్స్ లో మంచి లాభాలు చూసింది. మరుసటి సంవత్సరం అంటే 1968లో ఇదే తోట సుబ్బారావు, సి.పుల్లయ్య దర్శకత్వంలోనే యన్టీఆర్ హీరోగా ‘భామావిజయం’ నిర్మించగా, ఆ సినిమా కూడా జనాదరణ చూరగొంది.
ఏయన్నార్ కు ఎనలేని కీర్తిని సంపాదించి పెట్టిన 1953 నాటి ‘దేవదాసు’ కు బి.యస్.రంగా సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. తరువాత ఏయన్నార్ తో తెలుగులో ‘తెనాలి రామకృష్ణ’, శివాజీగణేశన్ తో తమిళంలో ‘తెనాలి రామన్’ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు రంగా. ఈ రెండు చిత్రాల్లోనూ యన్టీఆర్ శ్రీకృష్ణదేవరాయలుగా నటించారు. ఏయన్నార్ తొలి రంగుల చిత్రం ‘అమరశిల్పి జక్కన్న’ను నిర్మించి, దర్శకత్వం వహించారు బి.యస్.రంగా. ఆ సినిమా ఆట్టే అలరించక పోయినా, రిపీట్ రన్స్ లో కాసులు కురిపించింది. అందువల్ల ‘వసంతసేన’ రంగుల చిత్రంలో ఏయన్నార్ నటించారు. ఈ సినిమా పరాజయం పాలు కాగా
బి.యస్.రంగా మళ్ళీ భారీ చిత్రాలు తీసింది లేదు.
‘నిండుమనసులు’తో తనకు ఓ రీమేక్ ద్వారా మంచి విజయం అందించిన యస్.డి.లాల్ అంటే యన్టీఆర్ కు మంచి గురి కుదిరింది. ఆ తరువాత లాల్ అడగ్గానే యన్టీఆర్ కాల్ షీట్స్ ఇచ్చారు. యన్టీఆర్ తో లాల్ ‘నేనే మొనగాణ్ణి’ అనే సినిమాను నిర్మించి, దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. దాంతో లాల్ ను ఆదుకొనేందుకు యన్టీఆర్ తన దగ్గరకు వచ్చిన హిందీ రీమేక్స్ కు ఆయననే దర్శకునిగా సూచించేవాచు. అలా ఆ తరువాత యన్టీఆర్ తో “భలే మాస్టర్, నిప్పులాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం, నేరం నాదికాదు ఆకలిది, మగాడు, లాయర్ విశ్వనాథ్”వంటి హిందీ రీమేక్స్ తీశారు లాల్. ఆయన కెరీర్ లో 19 తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించగా, అందులో 9 సినిమాలు యన్టీఆర్ తోనే రూపొందించడం విశేషం!
