ఇప్పుడు ప్రతీ కమర్షియల్ సినిమాలోనూ ఓ స్పెషల్ సాంగ్ పెట్టేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. క్రేజీ భామలు ఆ పాటల్లో నటించేందుకు ముందుకు వస్తుండటం, వాటికి ఆడియన్స్ నుంచి కూడా బాగా ఆదరణ వస్తున్న నేపథ్యంలో.. స్క్రిప్టులో చోటు లేకపోయినా, స్పేస్ క్రియేట్ చేసుకొని మరీ ఐటెం సాంగ్స్‌ని జోడించేస్తున్నారు. లేటెస్ట్ న్యూస్ ప్రకారం.. సురేందర్ రెడ్డి, అఖిల్ కాంబోలో రూపొందుతోన్న ‘ఏజెంట్’ సినిమాలోనూ ఒక స్పెషల్ సాంగ్ ఉండనుందట!
ఈ స్పెషల్ సాంగ్ కోసం కొందరు భామల్ని పరిశీలించిన మేకర్స్.. చివరికి ఫరియా అబ్దుల్లాని ఫైనల్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. ‘జాతిరత్నాలు’తో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ అమ్మడు.. తొలి చిత్రంతోనే హిట్ అందుకోవడంతో క్రేజీ ఆఫర్స్ అందిపుచ్చుకుంటోంది. ఆల్రెడీ ఈ అమ్మడు ‘బంగార్రాజు’ సినిమాలో నాగార్జున, నాగ చైతన్యలతో కలిసి ఓ ప్రత్యేకమైన పాటలో ఆడిపాడింది. ఇప్పుడు అదే అక్కినేని కుటుంబానికి చెందిన చిన్నోడితో చిందులు వేసేందుకు రెడీ అవుతోంది. అయితే, దీనిపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది.
కాగా.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో తొలి కమర్షియల్ విజయం అందుకున్న అఖిల్, ఏజెంట్ కోసం చాలా కష్టపడుతున్నాడు. తీవ్ర కసరత్తు చేసి, కండలు భారీగా పెంచాడు. ఇందులో అతడు రెండు వేరియేషన్స్ ఎలివేట్ అయ్యేలా రెండు డిఫరెంట్ పర్సనాలిటీస్‌లో కనిపించనున్నాడట! సాక్షీ వైద్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
