Fahadh Faasil: ‘పుష్ప 2’ తర్వాత ఫహద్ ఫాసిల్ మరో సర్‌ప్రైజ్.. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ టీజర్‌తో భారీ హైప్

Fahadh Faasil (1)

Fahadh Faasil (1)

Fahadh Faasil: ‘పుష్ప 2’లో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మాలీవుడ్ స్టార్ ఫహద్ ఫాసిల్. అయితే ఇప్పుడు తెలుగు హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. వైవిధ్యమైన కథలను ఎంచుకోవడంలో ఎప్పుడూ ముందుండే ఫహద్, ఈసారి కూడా భిన్నమైన ఫాంటసీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ టీజర్ ఈవాల విడుదల అయింది. థ్రిల్లింగ్, ఫాంటసీ, కామెడీ కలగలిపిన ఈ టీజర్ కు ప్రేక్షకుల్లో మంచి హైప్ వస్తోంది.

2024 మార్చిలో ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ ఎట్టకేలకు ప్రజల ముందుకు రాబోతోంది. దర్శకుడిగా శశాంక్ యేలేటి తొలి ప్రయత్నం చేస్తున్న ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్ ‘సూరి’ అనే పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన కొత్త నటి సారా ‘దివ్య’ పాత్రలో నటిస్తోంది. హైదరాబాద్ నేపథ్యంగా సాగే ఈ కథలో సూరి జీవితంలోకి దివ్య ప్రవేశించిన తర్వాత అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆమెకు మనుషులకు లేని కొన్ని విచిత్రమైన శక్తులు ఉన్నాయని సూరి గుర్తిస్తాడు. దీంతో ఆమె నిజంగానే దెయ్యమా? లేక ఆ రహస్యాల వెనుక మరేదైనా కారణం ఉందా? అనే సందేహాల చుట్టూ కథ ముందుకు సాగుతుంది.

తాజాగా విడుదలైన టీజర్ సినిమా కథను పూర్తిగా బయటపెట్టకుండా, ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేలా రూపొందించారు. ఫహద్ ఫాసిల్ తన నటనతో మరోసారి పూర్తిగా ఒదిగిపోయినట్లు కనిపిస్తున్నారు. మరోవైపు సారా కూడా తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంది. ఫాంటసీ అంశాలతో పాటు థ్రిల్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతున్నట్లు టీజర్‌ చూస్తే తెలుస్తోంది. ఈ చిత్రాన్ని టాలీవుడ్‌లో నిర్మాణ సంస్థలైన ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మిస్తున్నారు. అంతేకాదు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటం కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.

నిర్మాతలు ప్రకటించిన వివరాల ప్రకారం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రం 2026 సెప్టెంబర్ 11న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి థియేటర్లలో విడుదల కానుంది. మాలీవుడ్‌లో ఇప్పటికే అగ్ర నటుడిగా గుర్తింపు పొందిన ఫహద్ ఫాసిల్‌కు ఇది నేరుగా తెలుగు మార్కెట్‌లో మరో కీలక అడుగుగా భావిస్తున్నారు. టీజర్‌కు వస్తున్న స్పందన చూస్తుంటే, విడుదలకు ముందే ఈ సినిమా చుట్టూ మంచి బజ్ ఏర్పడినట్లు స్పష్టమవుతోంది. ఇప్పుడు ఫహద్ ఫాసిల్ తొలి తెలుగు మూవీ ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.