Drishyam 2 Trailer Released: మళయాళంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన ‘దృశ్యం, దృశ్యం-2’ చిత్రాలు విశేషాదరణ చూరగొన్నాయి. వాటిని తెలుగులో వెంకటేశ్ తో రీమేక్ చేయగా ఇక్కడా అలరించాయి. హిందీలో అజయ్ దేవగన్ హీరోగా అదే టైటిల్ తో తెరకెక్కిన ‘దృశ్యం’ కూడా విజయం సాధించింది. ఇప్పుడు ‘దృశ్యం-2’ జనం ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హిందీ ‘దృశ్యం-2’ ట్రైలర్ ను సోమవారం గోవాలో రిలీజ్ చేశారు. మళయాళ, తెలుగు చిత్రాలు చూసిన వారికి కొత్తగా ఏమీ అనిపించదు. కానీ, ఇందులో అజయ్ దేవగన్ గెటప్ లో పెద్దగా మార్పు లేకున్నా, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నటించిన అక్షయ్ ఖన్నా ఈ రెండు చిత్రాల కన్నా భిన్నంగా కనిపిస్తారు. టబు, శ్రియ మొదటి భాగంలోలాగే తమ పాత్రల్లో కనిపించారు.
ఈ ట్రైలర్ లో ఓ పోలీస్ చెప్పిన “మై మేరే బివీ ఔర్ బచ్చోం కా బర్త్ డే బూల్ సక్తా హూ… లేకిన్ దో అక్తోబర్, తీన్ అక్తోబర్ కో నహీ బూల్ సక్తా…” అనే డైలాగ్ భలేగా ఆకట్టుకుంటోంది. ఎందుకంటే, అక్టోబర్ 2న మన జాతిపిత మహాత్మాగాంధీ జయంతి. చివరలో అజయ్ దేవగన్ నోట – “మేరా నామ్ విజయ్ సల్గోవంకర్ హై… యే మేరా కన్ఫెషన్…” అని చెబుతూ ట్రైలర్ ఎండ్ అవుతుంది. ఇది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. మళయాళం, తెలుగు చిత్రాలు చూసిన వారికి అంతగా థ్రిల్ కలగక పోవచ్చు. ఉత్తరాది వారికి హిందీ ‘దృశ్యం-2’ ట్రైలర్ ఖచ్చితంగా ఉత్కంఠ కలిగిస్తుందనే చెప్పవచ్చు. హిందీ ‘దృశ్యం-2’ నవంబర్ 18న జనం ముందుకు రానుంది. అప్పటి దాకా ఉత్తరాది ప్రేక్షకులు కాసింత సస్పెన్స్ తోనే ఈ సినిమా కోసం వేచి ఉండాలి.
