Disha Salian Death Case: ‘నేను ఇకపై మౌనంగా ఉండను’… దిశా సాలియన్ కేసుపై మౌనం వీడిన సూరజ్ పంచోలి

Disha Salian Death Case

Disha Salian Death Case

Disha Salian Death Case: దిశా సాలియన్ డెత్ కేసు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2020లో జరిగిన ఈ మరణంపై బాంబే హైకోర్టు ఆదేశాలతో సీబీఐ తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో కేసులో కొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఈ వ్యవహారంపై పెద్దగా మాట్లాడని నటుడు సూరజ్ పంచోలి తొలిసారి సుదీర్ఘంగా స్పందించారు. దిశా సాలియన్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆమెను జీవితంలో ఎప్పుడూ కలవలేదని ఆయన స్పష్టం చేశారు. తన పేరు పదేపదే ఈ కేసులోకి లాగడం తీవ్రంగా బాధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ 2020 జూన్‌లో ముంబైలో మరణించారు. ఆమె మరణంపై అప్పట్లో యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ నమోదు కాగా, ఈ కేసుపై తాజాగా బాంబే హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. సెప్టెంబర్ 14న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్‌లో శివసేన (యూబీటీ) నేత ఆదిత్య థాకరే, నటులు డినో మోరియా, సూరజ్ పంచోలి, రియా చక్రవర్తి తదితరుల పేర్లు దర్యాప్తు కోసం ప్రస్తావించబడ్డాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సూరజ్ పంచోలి సోషల్ మీడియా ద్వారా తన స్పందనను వెల్లడించారు. దిశా సాలియన్‌ను తాను ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎప్పుడూ కలవలేదని ఆయన చెప్పారు. అలాగే ఆదిత్య థాకరేను కూడా తన జీవితంలో ఎప్పుడూ కలవలేదని స్పష్టం చేశారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా, పదేపదే తన పేరును ఇందులోకి లాగడం తీవ్రంగా కలచివేస్తోందని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికే నాలుగైదేళ్ల క్రితమే పోలీసులు, సీబీఐ తనను ప్రశ్నించారని సూరజ్ తెలిపారు. అప్పుడే తన వాంగ్మూలాన్ని నమోదు చేశారని చెప్పారు. తన వద్ద దాచాల్సిన విషయం ఏమీ లేదని, దర్యాప్తు సంస్థలకు తన నుంచి మరింత సమాచారం అవసరమైతే మళ్లీ విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. దిశా సాలియన్ మరణానికి దారితీసిన పరిస్థితులపై నిష్పక్షపాతంగా, సమగ్రంగా దర్యాప్తు జరగాలని తాను కూడా కోరుకుంటున్నానని చెప్పారు. అదే సమయంలో ఈ కేసు పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కూడా సూరజ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఒకరి మరణంతో మరొకరి ప్రతిష్టను ముడిపెట్టడం సరికాదని అన్నారు. ఇప్పటివరకు ఈ కేసుపై మౌనం పాటించిన సూరజ్ పంచోలి మాత్రం తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఇకపై అంగీకరించబోనని స్పష్టం చేశారు. చట్టంపై, దర్యాప్తు సంస్థలపై తనకు నమ్మకం ఉందని, చివరకు నిజం బయటకు వస్తుందని ఆయన అన్నారు.

ఇక సూరజ్ పంచోలి విషయానికి వస్తే..  బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలి, నటి జరీనా వహాబ్ ల కుమారుడు ఇతను. సల్మాన్ ఖాన్ నిర్మాణ సంస్థ ద్వారా ‘హీరో’ (2015) సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించాడు. గతంలో జియా ఖాన్ ఆత్మహత్య కేసులోనూ ఇతని పేరు ప్రస్తావనకు రావడం, ఆ తర్వాత కోర్టు అతనికి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దిశా సాలియన్ డెత్ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.