వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా పరిణామాలు ఆసక్తిరేకిస్తున్నాయి. ఓ సినిమా కోసం రాంగోపాల్ వర్మ వరంగల్ జిల్లాలో సీక్రెట్ గా పర్యటిస్తున్నారు. ఇప్పటికే పలువురి బయోపిక్ ల పేరుతో సంచలనం సృష్టించిన రాంగోపాల్ వర్మ, మరో బయోపిక్ తీయడానికి సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలో ఆయన వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు.
రామ్ గోపాల్ వర్మ తాజాగా వరంగల్ లోని ఎల్బీ కళాశాలలో అధ్యాపకులను, సిబ్బందిని కలిసి కొంతసేపు రహస్యంగా చర్చించారు. ఎల్బీ కళాశాలకు సంబంధించిన అనేక అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఎల్బీ కళాశాల ప్రిన్సిపాల్ డీహెచ్ అరుణరావుతో సమావేశమై అనేక విషయాలను చర్చించారు. అనంతరం కళాశాల అంతా సందర్శించారు.
వరంగల్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ – మురళిల బయోపిక్ ను వర్మ ప్లాన్ చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఎల్బీ కళాశాలకి వెళ్లి వారి విద్యాభ్యాసం, ప్రేమకథ వివరాలు సేకరిస్తున్నారని అంటున్నారు. ఇదే కనుక నిజమైతే ఈ బయోపిక్ ఎలాంటి వివాదాలకు తెరతీస్తుందో చూడాలి. అంతేకాదు, సడెన్ గా వర్మ దృష్టి కొండా దంపతులపై ఎందుకు పడిందనేది కూడా చర్చనీయాంశంగా మారింది.
