Site icon NTV Telugu

Director Rajkumar Kohli’s Birthday : భారీ చిత్రాల రాజ్ కుమార్ కోహ్లి!

Raj Kumar

Raj Kumar

మానవాతీత శక్తులతో కథలు రూపొందించి చిత్రాలు తెరకెక్కించి విజయాలు సాధించాలని ప్రస్తుతం బాలీవుడ్ తహతహలాడుతోంది. రణబీర్ కపూర్, అలియా భట్ తొలిసారి జంటగా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ అందుకు ఓ తాజా ఉదాహరణ. గతంలో ఎన్నో సూపర్ న్యాచురల్ పవర్స్ తో బాలీవుడ్ సినిమాలు రూపొంది ఘనవిజయం సాధించాయి. ఓ దశలో వరుసగా ఆ తరహా చిత్రాలతో అలరించారు దర్శక నిర్మాత రాజ్ కుమార్ కోహ్లి. ఆ నాటి మేటి హీరోలతో సినిమాలు రూపొందించి హిందీ చిత్రసీమలో తనదైన బాణీ పలికించారు రాజ్ కుమార్ కోహ్లి. సెప్టెంబర్ 14న రాజ్ కుమార్ కోహ్లి 92 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు.

రాజ్ కుమార్ కోహ్లి 1930 సెప్టెంబర్ 14న జన్మించారు. సినిమాలపై ఆకర్షణ పెంచుకొని ముంబై బాట పట్టారు. ఆరంభంలో కొన్ని సినిమాలకు అసోసియేట్ గా పనిచేస్తూ చిత్ర నిర్మాణాన్ని పరిశీలించారు. తరువాత తానే నిర్మాతగా మారి “పిండ్ ది కుర్హి, మై జట్టీ పంజాబ్ ది, దుల్లా భట్టి” వంటి పంజాబీ చిత్రాలు నిర్మించారు. తరువాత హిందీ, పంజాబీ భాషల్లో ‘డంకా’ అనే సినిమాను తెరకెక్కించారు. ఇందులో దారాసింగ్ కథానాయకుడు. ఈ సినిమాలోనూ అంతకు ముందు రాజ్ కుమార్ కోహ్లి నిర్మించిన పంజాబీ చిత్రాల్లోనూ నాయికగా నటించిన నిషి తరువాతి రోజుల్లో కోహ్లి భార్య అయ్యారు. రాజేంద్ర కుమార్ ద్విపాత్రాభినయంతో కోహ్లి నిర్మించిన ‘గోరా ఔర్ కాలా’ 1972లో విడుదలై ఘనవిజయం సాధించింది. 1973లో కోహ్లి దర్శకునిగా మారి ‘కహానీ హమ్ సబ్ కీ’ అనే చిత్రం రూపొందించారు. మాలా సిన్హా, వినోద్ మెహ్రా నటించిన ఈ సినిమా ఆకట్టుకుంది. 1972లోనే శత్రుఘ్న సిన్హా హీరోగా ‘మిలాప్’ అనే హిందీ చిత్రం రూపొంది మంచి విజయం సాధించింది. అందులో శత్రుఘ్న సిన్హా ద్విపాత్రాభినయం చేశారు. ఓ పాత్ర పాముగా మారుతుంది. ఆ సినిమాలో రీనా రాయ్ నాయిక. ‘మిలాప్’ జనాదరణ పొందడంతో రాజ్ కుమార్ కోహ్లి కూడా ఆ తరహా కథను తయారు చేసుకొని ‘నాగిన్’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో రీనా రాయ్ నాగకన్యగా నటించారు. ఆమెకు జోడీగా నాగరాజు పాత్రలో జితేంద్ర కనిపించారు. ఈ సినిమాలో సునీల్ దత్, ఫిరోజ్ ఖాన్, వినోద్ మెహ్రా, సంజయ్ ఖాన్, కబీర్ బేడీ, రేఖ, ముంతాజ్ వంటి స్టార్స్ నటించారు. తన జోడీ అయిన పామును చంపినవారిపై ఆడ నాగు పగబట్టి వారి ప్రాణాలు తీస్తూ, చివరకు ఆమెనే చనిపోవడంతో కథ ముగుస్తుంది. ఈ సినిమా విజయంతో రాజ్ కుమార్ కోహ్లి పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఆ తరువాత నుంచీ రాజ్ కుమార్ కోహ్లి భారీ తారాగణంతో సినిమాలు తీయడంలో మేటి అనిపించుకున్నారు. అలా “ముఖాబ్లా, జానీ దుష్మన్, బద్లే కీ ఆగ్, నౌకర్ బివీ కా, రాజ్ తిలక్, జీనే నహీ దూంగా, ఇన్సానియత్ కే దుష్మన్” వంటి చిత్రాలు భారీ మల్టీస్టారర్స్ తెరకెక్కించి విజయం సాధించారు. ఈ చిత్రాలలో ఎక్కువగా రీనా రాయ్ నాయికగా నటించడం విశేషం! అలాగే ఆయన సినిమాల్లో సునీల్ దత్, ధర్మేంద్ర, జితేంద్ర, వినోద్ మెహ్రా వంటి స్టార్ హీరోస్ కూడా ఎక్కువగా కనిపించారు.

తరువాతి రోజుల్లో సన్నీ డియోల్, అనిల్ కపూర్, మిథున్ చక్రవర్తి వంటి వారితో రాజ్ కుమార్ కోహ్లి చిత్రాలు రూపొందించారు. కానీ, అవేవీ అంతగా అలరించలేదు. చివరగా ఆయన ‘జానీ దుష్మన్: ఏక్ అనోఖీ కహానీ’ అనే సినిమా తీశారు. సన్నీ డియోల్, అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి నటించిన ఈ సినిమా పరాజయం పాలయింది. 1992లో తన కొడుకు అర్మాన్ కోహ్లిని హీరోగా పరిచయం చేస్తూ ‘విరోధి’ అనే చిత్రం తెరకెక్కించారు. ఇందులో ధర్మేంద్ర, సునీల్ దత్, శక్తి కపూర్, ప్రేమ్ చోప్రా వంటి వారు నటించారు. అయితే అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఏది ఏమైనా మల్టీస్టారర్స్ సినిమాలు, సూపర్ న్యాచురల్ పవర్స్ తో సాగే కథలు గుర్తుకు వచ్చిన ప్రతీసారి రాజ్ కుమార్ కోహ్లి పేరును బాలీవుడ్ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం పరాజయాల బాటలో సాగుతున్న బాలీవుడ్ ను ఎలా మళ్ళీ విజయపథంలో పయనింప చేయాలని ఆలోచించేవారు కూడా రాజ్ కుమార్ కోహ్లిని గుర్తు చేసుకుంటున్నారు. మరి ఆయన స్ఫూర్తితో ఎవరు బాలీవుడ్ కు మల్టీస్టారర్ తో సక్సెస్ ఇస్తారో చూడాలి.

Exit mobile version