నవతరం దర్శకులు యాక్షన్, కామెడీ, సెంటిమెంట్, ఎమోషన్స్ మిక్స్ చేసి మురిపిస్తున్నారు. అలాంటి వారిలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు మలినేని గోపీచంద్. పట్టుమని పది చిత్రాలు తెరకెక్కించక పోయినా, ఇప్పటి దాకా తీసిన వాటితో జనాన్ని భలేగా కట్టిపడేశారు గోపీచంద్. తాజాగా బాలకృష్ణతో గోపీచంద్ తెరకెక్కిస్తోన్న చిత్రం ఇప్పటికే చిత్రసీమలో అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.
మలినేని గోపీచంద్ 1980 మార్చి 13న ప్రకాశం జిల్లా బొద్దులూరి వారి పాలెంలో జన్మించారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో గోపీచంద్ బాల్యం గడిచింది. ఇంటర్ చదువుతూ ఉండగానే సినిమాలపై మనసు పారేసుకొని, చిత్రసీమలో అడుగు పెట్టారు. కెమెరా అసిస్టెంట్ గా పనిచేశారు. ఈటీవీలోనూ కెమెరా డిపార్ట్ మెంట్ లో ఉన్నారు. శ్రీహరి హీరోగా తెరకెక్కిన ‘పోలీస్’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. శ్రీహరితో నాలుగు సినిమాలకు పనిచేసిన తరువాత ఇ.వి.వి. సత్యనారాయణ వద్ద అసోసియేట్ గా చేరారు. శ్రీను వైట్ల, మెహర్ రమేశ్, మురుగదాస్ వంటి వారి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన గోపీచంద్, తరువాత సొంతగా కథ రూపొందించుకొని, రవితేజను కలిశారు. గోపీచంద్ చెప్పిన సబ్జెక్ట్ నచ్చడంతో రవితేజ ఆయనకు దర్శకునిగా ‘డాన్ శ్రీను’తో అవకాశం కల్పించారు. తొలి చిత్రంతోనే గోపీచంద్ దర్శకునిగా మంచి పేరు సంపాదించుకున్నారు.
వెంకటేశ్ తో మళయాళ రీమేక్ ‘బాడీగార్డ్’ తెరకెక్కించారు. తరువాత రవితేజతోనే ‘బలుపు’, రామ్ హీరోగా ‘పండగ చేస్కో’, సాయిధరమ్ తేజ్ తో ‘విన్నర్’ రూపొందించారు. రవితేజతో గోపీచంద్ కు మూడవ చిత్రం ‘క్రాక్’. ఈ సినిమా గత సంవత్సరం సంక్రాంతి సంబరాల్లో విజేతగా నిలచి’ గోపీచంద్ కు మరింత పేరు సంపాదించి పెట్టింది. ఈ చిత్ర విజయంతో ఏకంగా బాలకృష్ణతో సినిమా తెరకెక్కించే ఛాన్స్ దక్కింది గోపీచంద్ కు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ నాయిక. తొలిసారి టాప్ స్టార్ తో సినిమా తీస్తోన్న గోపీచంద్ ఈ చిత్రంతో ఏ తరహా మ్యాజిక్ చేస్తారో చూడాలి.
