ఈ యేడాది ఫస్ట్ బ్లాక్ బస్టర్ ను అందించిన ఘనత నిస్సందేహంగా యంగ్ డైరెక్టర్ మలినేని గోపీచంద్ కే దక్కుతుంది. జనవరి 12న విడుదలైన ‘వీరసింహారెడ్డి’తో ఆ ఫీట్ సాధించారు గోపీచంద్. ఈ సంవత్సరం మొదటి రోజున రూ.54 కోట్ల గ్రాస్ ను చూసిన సినిమాగా ‘వీరసింహారెడ్డి’ రికార్డ్ సృష్టించింది. తన అభిమాన కథానాయకుడు నందమూరి బాలకృష్ణతో గోపీచంద్ మలినేని రూపొందించిన ఈ చిత్రం హీరో కెరీర్ లో ‘టాప్ గ్రాసర్’గా నిలవడం విశేషం! మాస్ ను అలరించే అన్ని అంశాలనూ మేళవించి, గోపీచంద్ ‘వీరసింహారెడ్డి’ని రూపొందించిన తీరు అలరించింది. గోపీచంద్ ఇప్పటి దాకా తీసింది పట్టుమని పది చిత్రాలయినా లేవు. కానీ, యాక్షన్ తో కనికట్టు చేయడంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు గోపీచంద్.
శ్రీహరి హీరోగా పరిచయమైన ‘పోలీస్’ సినిమాతోనే గోపీచంద్ మలినేని చలనచిత్ర జీవితం ఆరంభమయింది. ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు గోపి. ఆ పై వరుసగా శ్రీహరి హీరోగా నటించిన “దేవా, సాంబయ్య” సినిమాలకూ అసిస్టెంట్ డైరెక్టర్ గానే కొనసాగారు. ఇ.వి.వి. సత్యనారాయణ, శ్రీను వైట్ల, మురుగదాస్ వంటి దర్శకుల వద్ద అసోసియేట్ గా, ఛీప్ అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన గోపీచంద్ మలినేని , రవితేజ -శ్రియ జంటగా ‘డాన్ శీను’ సినిమా తెరకెక్కిస్తూ దర్శకునిగా పరిచయమయ్యారు. ఆ సినిమా ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రం బెంగాల్ లో ‘బాద్ షా ద డాన్’గా రీమేక్ అయింది. తొలి చిత్రంతోనే జనానికి వినోదం పంచగలడు అనే పేరు సంపాదించారు గోపి.
మళయాళ హిట్ మూవీ ‘బాడీగార్డ్’ ఆధారంగా వెంకటేశ్ తో అదే టైటిల్ తో గోపీచంద్ ఓ సినిమా రూపొందించారు. అది అంతగా ఆకట్టుకోలేక పోయింది. మళ్ళీ రవితేజతో ‘బలుపు’ అనే చిత్రం తెరకెక్కించారు. అది మాస్ ను రంజింపచేసింది. రామ్ తో ‘పండగచేస్కో’, సాయిధరమ్ తో ‘విన్నర్’ సినిమాలు తీసినా, గోపీచంద్ కు భారీ విజయం లభించలేదు. మళ్ళీ తనకు అచ్చి వచ్చిన హీరో రవితేజతో ‘క్రాక్’ రూపొందించారు. గత సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలైన ‘క్రాక్’ ఘనవిజయం సాధించింది. దాంతో గోపీచంద్ మలినేనికి క్రేజ్ కూడా పెరిగింది. ‘క్రాక్’తో గోపీచంద్ సాధించిన విజయానికి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా పిలిపించి, ఆయనను అభినందించారు. తరువాత బాలకృష్ణ వంటి టాప్ స్టార్ తో సినిమా తీసే అవకాశం గోపీచంద్ సొంతమయింది. తత్ఫలితంగా తెరకెక్కిన చిత్రమే ‘వీరసింహారెడ్డి’. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ కు తగిన రీతిలో ఈ సినిమాను రూపొందించి అభిమానులను ఎంతగానో మురిపించారు గోపీచంద్. అలాగే ‘వీరసింహారెడ్డి’ని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చూసి, గోపీచంద్ ను అభినందించారు. బాలయ్యతో మరో సినిమా తీసే ఛాన్స్ కోసమై గోపీచంద్ ఎదురుచూస్తున్నారు. మరికొందరు మాస్ హీరోలు సైతం గోపీచంద్ దర్శకత్వంలో నటించడానికి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. మరి తరువాతి సినిమాతో గోపీచంద్ ఏ స్థాయి సక్సెస్ ను సొంతం చేసుకుంటారో చూడాలి.
