డింపుల్ కపాడియా… ఈ పేరు ఆ రోజుల్లో ఎంతోమంది రసికాగ్రేసరులకు నిద్రలేని రాత్రులు మిగిల్చింది. అప్పటి డింపుల్ అందాలను తలచుకొని ఈ నాటికీ పరవశించిపోయేవారెందరో ఉన్నారు. అందానికే ఓ ఆలోచన వచ్చి డింపుల్ కపాడియాలా పుట్టిందనీ అనే అభిమానులు లేకపోలేదు. జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా వెలుగొందారు డింపుల్ కపాడియా.
డింపుల్ కపాడియా 1957 జూన్ 8న ముంబైలో జన్మించింది. ఆమె అసలు పేరు అమీనా. ఆగా ఖాన్ వంశానికి చెందినవారు. ముంబై శాంటాక్రజ్ లోని సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ హై స్కూల్ లో డింపుల్ చదివింది. పదునాలుగేళ్ళ ప్రాయంలోనే కెమెరా ముందుకు వచ్చింది. 16 ఏళ్ళ సమయానికి ముగ్ధమనోహరంగా ‘బాబీ’లో మురిపించింది. ‘షో మేన్’ రాజ్ కపూర్ తెరకెక్కించిన ‘బాబీ’ పాటలతో అలరించడం ఓ ఎత్తయితే, డింపుల్ పరువాలతో పరవశింపచేయడం మరో ఎత్తు అని చెప్పాలి. ఇందులో టూ పీస్ బికినీలో డింపుల్ తెరపై కనిపించగానే ఎంతోమంది యువకుల లయ తప్పింది. ఆ సీన్ కోసమే మళ్ళీ మళ్ళీ ‘బాబీ’ చిత్రాన్ని చూసిన వారున్నారు. ఆ సినిమాలో ఏ మాత్రం అదరక బెదరక నటించిన డింపుల్ కపాడియా ఉత్తమనటిగా ‘ఫిలిమ్ ఫేర్’ అవార్డును ఎగరేసుకు పోయింది. 16 ఏళ్ళ వయసులో ఫిలిమ్ ఫేర్ నామినేషన్ సంపాదించడమే కాదు, ఉత్తమ నటిగానూ నిలచింది. ఈ నాటికీ అంత పిన్నవయసులో ‘బ్లాక్ లేడీ’ని తమతో తీసుకుపోయిన మరో ముద్దుగుమ్మ కనిపించలేదు. ఇక ‘రుడాలి’లో తన నటవిశ్వరూపం చూపించి, జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగానూ డింపుల్ నిలచింది. డింపుల్ అందం చూసి, ఆమె ఇండియన్ కాదనుకొనేవారు చాలామంది. ఆమెలో హాలీవుడ్ అందం దాగివుందని పలువురు అభిమానులు కీర్తించేవారు. అందుకేనేమో నవతరం దర్శకుల్లో తనదైన బాణీ పలికిస్తున్న హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలాన్ తన ‘టెనెట్’లో అదే పనిగా డింపుల్ ను ఎంచుకున్నారు అనిపిస్తుంది.
రాజ్ కపూర్ లాంటి షో మేన్ తన ‘బాబీ’ కోసం డింపుల్ కపాడియాను ఎంపిక చేయడంతో ఆమె గురించిన ప్రచారం హిందీ చిత్రసీమలో విశేషంగా సాగింది. అది అలా వెళ్ళి ఆ నాటి సూపర్ స్టార్ రాజేశ్ ఖన్నాను చేరింది. అతను తొలి చూపులోనే డింపుల్ పై మనసు పారేసుకున్నాడు. అప్పటికే సూపర్ స్టార్ గా జేజేలు అందుకుంటున్న రాజేశ్ ఖన్నాను చూశాక, డింపుల్ కూడా ఇష్టపడింది. దాంతో తనకంటే వయసులో 15 ఏళ్ళు పెద్దవాడయినా, రాజేశ్ ఖన్నాను వివాహమాడటానికి అంగీకరించింది డింపుల్. ‘బాబీ’ రిలీజ్ కు కొన్ని నెలల ముందే రాజేశ్, డింపుల్ పెళ్ళాడారు. పెళ్ళయ్యాక డింపుల్ సినిమాలకు దూరంగా ఉంది. ట్వింకిల్ ఖన్నా, రింకీ ఖన్నా పుట్టిన తరువాత కూడా రాజేశ్, డింపుల్ మధ్య అన్యోన్యబంధమే ఉందని చెప్పవచ్చు. ఎందువల్లో రాజేశ్, డింపుల్ మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. దాంతో పరస్పర అంగీకారంతోనే విడిపోయారు.
ఇద్దరు పిల్లల తల్లి అయిన తరువాత కూడా డింపుల్ లోని అందం గంధాలు పూసేలా ఉండేది. దాంతో డింపుల్ నటిస్తే బాగుంటుందని అభిమానులు ఆశించారు. డింపుల్ కూడా తాను నటించడానికి సిద్ధం అని ప్రకటించింది. అదే సమయంలో మన దర్శకరత్న దాసరి నారాయణ రావు తాను రూపొందించిన ‘బొబ్బిలిపులి’ని హిందీలో ‘జక్మీ షేర్’గా తెరకెక్కిస్తూ ఉన్నారు. అందులో కథానాయికగా డింపుల్ ను ఎంచుకున్నారు. తెలుగులో శ్రీదేవి పోషించిన పాత్రను హిందీలో డింపుల్ కపాడియా ధరించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మరికొన్ని చిత్రాలను అంగీకరించారు డింపుల్. వాటిలో ‘మంజిల్ మంజిల్’ ఒకటి. ఇందులో సన్నీ డియోల్ హీరో. ఈ సినిమా సమయంలోనే సన్నీడియోల్ తో డింపుల్ కు అనుబంధం పెరిగింది. వారిద్దరూ ఆ తరువాత ‘అర్జున్’లోనూ కలసి నటించారు. సహజీవనం సాగించారు. వారిద్దరి ప్రేమకథ చిత్రసీమలో భలేగా చక్కర్లు కొట్టింది. వారి లవ్ ఎఫైర్ ను క్యాష్ చేసుకొనేందుకు నిర్మాతలు, దర్శకులు కూడా సన్నీ, డింపుల్ జోడీని ఎంచుకొనేవారు. హీరో కృష్ణ హిందీలో నిర్మించిన ‘పాతాళభైరవి’లో “చుమ్మా చుమ్మా…” సాంగ్ లో నర్తించీ డింపుల్ కపాడియా వార్తల్లో నిలిచారు. తన తొలి హీరో రిషీకపూర్ తో కలసి ‘సాగర్’లో నటించింది. కమల్ హాసన్ మరో హీరోగా నటించిన ‘సాగర్’ అనూహ్య విజయం సాధించింది. అప్పటి నుంచీ తన దరికి చేరిన పాత్రలను అంగీకరిస్తూ డింపుల్ ముందుకు సాగారు. పురుషాధిక్య ప్రపంచలో భర్త అండ లేకపోయినా, రాణించవచ్చునని డింపుల్ నిరూపించారు. ఇక విలక్షణమైన కథాంశంతో రూపొందిన ‘రుడాలి’లో డింపుల్ కపాడియా అభినయం ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రం ద్వారా బెస్ట్ యాక్ట్రెస్ గా ఆమెకు నేషనల్ అవార్డు లభించింది. మరో విశేషమేమంటే, ఈ సినిమాకు డింపుల్ చెల్లెలు సింపుల్ కపాడియా కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు. ఆమెకు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా నేషనల్ అవార్డు దక్కింది. అలా అక్కాచెల్లెళ్ళు ఇద్దరూ ఒకేసారి, ఒకే సినిమాతో జాతీయ అవార్డులు అందుకోవడం చిత్రసీమలో విశేషమనే చెప్పాలి.
