సినిమా కమిట్ అయి చేశామంటే అది రిలీజ్ అయిన తర్వాత కూడా ఆడియన్స్ వద్దకు చేర్చే బాధ్యత తారలదే. ఈ విషయం ఎవరైనా ఒప్పుకుంటారు. అయితే దక్షిణాది సూపర్ స్టార్ అనే ట్యాగ్ వేసుకున్న నయనతార మాత్రం ఇందుకు మినహాయింపు. తనకు స్టార్ డమ్ వచ్చిన తర్వాత సొంత సినిమాలు తప్ప మిగతా సినిమాల ప్రచారంలో అమ్మడు పాల్గొన్నది తక్కువే. అదే సాయిపల్లవిని తీసుకుంటే ఎప్పుడో కమిట్ అయి రిలీజ్ కాక ఆగిన సినిమా రీలీజ్ అవుతుంటే ముందుండి ప్రమోట్ చేసి ఎక్కడికంటే అక్కడికి వచ్చి దర్శకనిర్మాతలకు సహకరించిన తీరు మర్చిపోలేము. ఆ సినిమానే ఇటీవల విడుదలైన ‘విరాట పర్వం’. రెండేళ్ళ క్రితం పూర్తయిన సినిమా ఎందుకు ప్రచారం చేయాలని భావించక తను నచ్చి చేసిన పాత్రను జనాల్లోకి తీసుకువెళ్ళడంలో కీలక పాత్ర పోషించింది సాయిపల్లవి. ముక్కుపిండి పారితోషికం వసూలు చేసే నైజం నయనతారది అయితే నిర్మాత కష్టాల్లో ఉంటే ఇవ్వవలసిన పారితోషికాన్ని వద్దని చెప్పగలిగే మంచి మనస్తత్వ ఉన్న హీరోయిన్ సాయిపల్లవి.
ఇక ఇటీవల జరిగిన రెండు మేజర్ సంఘటలను కూడా వీరి క్యారక్టర్స్ కి అద్దం పట్టేవిగా ఉన్నాయి. ఇద్దరు ముగ్గురుతో ప్రేమాయణం నడిపి చివరకు దర్శకుడు విఘ్నేష్ శివన్ ను పెళ్లాడిన నయన్ పెళ్ళి తర్వాత తిరుమలకు వేంకటేశ్వరస్వామి దర్శనార్థం వచ్చింది. దేవుని దర్శనం ముగిసిన తర్వాత మాడవీధుల్లో ఫోటో షూట్ చేస్తూ చెప్పులు ధరించి అపవిత్రం చేసింది. ఇది మీడియాలో హైలైట్ అయి విమర్శలు వెల్లువెత్తడంతో విఘ్నేష్ శివన్ సారీ చెప్పి తెలియక జరిగిన పొరపాటని సర్ధి చెప్పాడే కానీ నయనతార స్పందించనే లేదు.
అదే ‘విరాటపర్వం’ ప్రచారంలో భాగంగా ఓ యు ట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ‘కాశ్మీర్ ఫైల్స్’, పాకిస్థాన్ విషయాలపై కామెంట్స్ చేసింది. అయితే అవి వివాదాస్పదం అయ్యాయి. ఇదే విషయమై ప్రెస్ మీట్స్ తో తనని ప్రశ్నించినపుడు తను సినిమా ప్రచారంలో ఉన్నానని తన వ్యాఖ్యలపై తప్పక స్పందిస్తానని తెలియచేసింది. అప్పుడు అందరూ దాటవేయటానికి అలా చెప్పిందని భావించారు. కానీ సాయి పల్లవి అలా భావించలేదు. తనా వ్యాఖ్యలను ఏ సందర్భంలో చేసిందో సవివరంగా సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియచేసింది. ఈ రెండు సందర్భాలను తరచి చూసుకుంటే నిజానికి నయనతార తనంతట తాను మీడియా ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పవలసిన అంశం. అయినా చీమకుట్టినట్లు గా కూడా తీసుకోలేదు. సాయిపల్లవి మాత్రం తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వటం బాధ్యతగా భావించి స్పందించింది. ఇదే నయనతారకు సాయిపల్లవికి మధ్య ఉన్న తేడా. సో స్టార్ డమ్ తో పాటే ప్రేక్షకుల్లో బాధ్యతగల పౌరులు అనిపించుకోవడం కూడా ఎంతో ముఖ్యం. నయనతారకు లేనిది సాయిపల్లవికి ఉన్నది అదే… బాధ్యత. కాదంటారా!?
