Site icon NTV Telugu

Rehman Dakait: దావూద్ ఇబ్రహీంను తమ్ముడ్ని అత్యంత దారుణంగా చంపిన రెహ్మాన్ డకాయిట్

‘ధురందర్ 2’ సృష్టిస్తున్న సంచలనం కేవలం సినిమాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు మాత్రమే పరిమితం కాలేదు, దశాబ్దాల కాలంగా కరాచీ అండర్‌వరల్డ్‌లో పాతిపెట్టబడిన చీకటి కోణాలను మళ్ళీ వెలుగులోకి తెచ్చింది. ముఖ్యంగా అక్షయ్ ఖన్నా పోషించిన ‘రెహ్మాన్ బలోచ్’ పాత్ర, వాస్తవ ప్రపంచంలో ఒకప్పుడు కరాచీని గడగడలాడించిన గ్యాంగ్‌స్టర్ రెహ్మాన్ డకైత్ భీభత్సాన్ని గుర్తు చేస్తోంది. భారత నిఘా వర్గాల కథనం ప్రకారం.. మోస్ట్ వాంటెడ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు నూర్ ఉల్ హక్ (అలియాస్ నూరా) మరణం వెనుక ఉన్నది రెహ్మాన్ డకైత్ అని నమ్ముతారు. ఇదే విషయాన్నీ రెహమాన్ ను అంతమొందించిన అనంతరం ఎస్పీ చౌదరి అస్లాం పాత్ర మేజర్ ఇక్బాల్ పాత్రకు చెబుతుంది. ఇది కేవలం హత్య మాత్రమే కాదు, అండర్‌వరల్డ్ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఉదంతంగా చెబుతారు. నూరాను అపహరించి, చిత్రహింసలకు గురిచేసి, తలలోకి బుల్లెట్లు దించి చంపినట్లు సమాచారం, ఆ తర్వాత అతని మృతదేహాన్ని దావూద్ నివాసం సమీపంలోనే పడేసి, డీ-కంపెనీకి నేరుగా సవాలు విసిరాడు రెహ్మాన్. అప్పట్లో దావూద్ కుటుంబం ఇది గుండెపోటుతో జరిగిన మరణమని నమ్మబలికినప్పటికీ, ల్యారీ ప్రాంత గ్యాంగ్ వార్ శైలిలోనే ఈ హత్య జరిగిందని భారత ఏజెన్సీలు తేల్చిచెప్పాయి.

Also Read: Dhurandhar 2: బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్’ వసూళ్ల సునామీ.. ‘ఆర్‌ఆర్ఆర్‌’ రికార్డులు బ్రేక్

ఎవరీ రెహ్మాన్ బలోచ్‌?
సినిమాలో రెహ్మాన్ బలోచ్‌గా అక్షయ్ ఖన్నా నటన ఎంత క్రూరంగా ఉందో, నిజ జీవితంలో రెహ్మాన్ డకైత్ అంతకంటే భయంకరమైన వ్యక్తని చెబుతారు పాక్ జనం. 1975లో పుట్టిన సర్దార్ అబ్దుల్ రెహ్మాన్ బలోచ్, చిన్న వయసులోనే డ్రగ్స్ కు బానిసై నేర ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. హాజీ లాలూ ముఠాను తన హస్తగతం చేసుకున్న తర్వాత.. వసూళ్లు, కాంట్రాక్ట్ హత్యలు, రాజకీయ బెదిరింపులతో కరాచీని తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు. ఉజైర్ బలోచ్, బాబా లాడ్లా వంటి వారితో కలిసి తను సృష్టించిన భయానక వాతావరణం ల్యారీ వీధుల్లో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుందని అంటుంటారు. దావూద్ కుటుంబ సభ్యుడినే టార్గెట్ చేయడం ద్వారా, తను ఎవరికీ తలవంచనని రెహ్మాన్ నిరూపించుకోవాలనుకున్నాడు అందుకే ఇది కేవలం వ్యక్తిగత కక్ష కాదు, కరాచీ నేర సామ్రాజ్యంలో తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి చేసిన సాహసం.

అయితే రెహ్మాన్ డకైత్ హవా 2009 ఆగస్టులో ముగిసింది. కరాచీలో జరిగిన ఒక పోలీస్ ఎన్‌కౌంటర్‌లో 34 ఏళ్ల వయసులో అతను హతమయ్యాడు, అతని మరణం తర్వాత ఉజైర్ బలోచ్ ఆ నెట్‌వర్క్‌ను నడిపించడంతో ల్యారీలో హింస మాత్రం ఆగలేదు. ఇక ‘ధురందర్’ ద్వారా ఈ గ్యాంగ్ వార్ దృశ్యాలు మళ్ళీ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. సినిమాలో కొన్ని సంఘటనలను కల్పితంగా చూపించినప్పటికీ, దావూద్ సోదరుడి హత్యకు సంబంధించిన వాస్తవ కథనాలు మాత్రం ఇప్పటికీ అండర్‌వరల్డ్ చరిత్రలో అత్యంత భయంకరమైన అధ్యాయంగానే మిగిలిపోయాయి.

Exit mobile version