‘ధర్మచక్రం’ అనగానే విక్టరీ వెంకటేశ్ నటించిన సినిమా గుర్తొస్తుంది. ఇప్పుడు అదే పేరుతో మరో సినిమా తెరకెక్కుతోంది. సంకేత్ తిరుమనీడి, మోనిక చౌహాన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు నాగ్ ముంత దర్శకత్వం వహిస్తున్నారు. జీపీ రెడ్డి నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి వరుణ్ క్లాప్ కొట్టగా, రాజశేఖర్ కెమెరా స్విచ్ఆన్ చేశారు. ఎం. శ్రీధర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సినిమా గురించి నిర్మాత జీపీ రెడ్డి మాట్లాడుతూ, ”సమాజంలో ఆడపిల్లల మీద జరిగే అన్యాయాల మీద ఈ కథను దర్శకుడు రాసుకున్నారు. ఆయన చెప్పిన కథాకథనాలు నచ్చి దీనిని నిర్మించేందుకు ముందుకు వచ్చాను” అని అన్నారు.
హీరో సంకేత్ మాట్లాడుతూ, ”దర్శకుడు నాగ్ మంచి కథను చెప్పారు. ఎన్ని చట్టాలు వచ్చినా సమాజంలో ఆడపిల్లలకు భద్రత లేకుండా పోతోందనే మంచి సందేశం ఈ సినిమాలో ఉంది” అని చెప్పారు. హీరోయిన్ మోనిక చౌహాన్ మాట్లాడుతూ, ”నిర్భయ, దిశ ఘటనలాంటివి మనం ఇప్పటికీ అనేకం చూస్తున్నాం. అలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు రాకూడదు. నేను ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నాను. ప్రేక్షకుల ఆశీస్సులు లభిస్తే మంచి పాత్రలు పోషించాలని ఉంది” అని అన్నారు. దర్శకుడు నాగ్ ముంత మాట్లాడుతూ, ”మహిళలకు స్వీయ రక్షణ నేర్చించేలా ఈ సినిమా ఉంటుంది. ఓ చక్కని సందేశాన్ని ఈ సినిమా ద్వారా అందించబోతున్నాం. అందుకే కథానుగుణంగా దీనికి ‘ధర్మచక్రం’ అనే పేరు పెట్టాం. నాన్ స్టాప్ గా సినిమా షూటింగ్ పూర్తి చేసి, సెప్టెంబర్ లో జనం ముందుకు రావాలని అనుకుంటున్నాం” అని చెప్పారు. ఈ చిత్రానికి ప్రణయ్ రాజపుటి సంగీతాన్ని అందిస్తుండగా, ఆనంద్ మిలింగి కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. ఎం. ఆనంద్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.
