మన తమిళ స్టార్ హీరో తనదైన అభినయంతో ఎల్లలు చెరిపేసుకుంటూ దూసుకుపోతున్నారు. తొలుత మాతృభాష తమిళంలోనూ, తరువాత అనువాద చిత్రాల ద్వారా తెలుగు, కన్నడ సీమల్లోనూ, ఆ పై మళయాళంలోనూ నటించి అలరించారు. తరువాత హిందీ చిత్రసీమలోనూ తనదైన బాణీ పలికించారు ధనుష్. ఇప్పుడు హాలీవుడ్ మూవీ ‘ద గ్రే మేన్’ అనే సినిమాతో జూలై 15న జనం ముందుకు రానున్నారు ధనుష్. ఈ మూవీ విడుదలైన వారానికే అంటే జూలై 22నే నెట్ ఫ్లిక్స్ లో ప్రత్యక్షం కానుంది. ఆంటోనీ రస్సో, జో రస్సో దర్శకత్వంలో రూపొందిన ‘ద గ్రే మేన్’లో ధనుష్ ఓ కీలక పాత్ర పోషించారు. ఇందులో ప్రధాన పాత్రల్లో ర్యాన్ గోస్లింగ్, క్రిస్ ఎవాన్స్, అనా డి అర్మాస్ కనిపించనున్నారు.
ఇంగ్లిష్ సినిమాల్లో నటించడం ధనుష్ కు ఇదే మొదటి సారి కాదు. 2018లో రూపొందిన ‘ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్’ అనే ఇంగ్లిష్ మూవీలో ధనుష్ నటించారు. ఇది 2019లో మనదేశంలోనూ విడుదలయింది. ఫ్రాన్స్ దేశం నిర్మించిన ఈ ఇంగ్లిష్ సినిమా ధనుష్ కు చేదు అనుభవాన్నే మిగిల్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ ‘ఫకీర్’ సత్తా చాటలేకపోయాడు. కానీ, హాలీవుడ్ మూవీలో ధనుష్ నటించడం ‘ద గ్రే మేన్’తోనే మొదలని చెప్పవచ్చు. అన్నట్టు ‘ది ఎక్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్’లో ధనుష్ హీరో. ‘ద గ్రే మేన్’లో అతను ఓ కీ రోల్ మాత్రమే కనిపిస్తున్నారు. తొలి ఇంగ్లిష్ చిత్రం నిరాశ పరచింది. మరి ఈ రెండో సినిమా ధనుష్ కు ఎలాంటి అనుభవం కలిగిస్తుందో చూడాలి.
