టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ వెండితెరపై నటుడిగా అరంగేట్రం చేస్తున్నారనే వార్త ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అయితే, ఆ అరంగేట్రం ఇంత పవర్‌ఫుల్ గా, ఇంత రా అండ్ రస్టిక్ గా ఉంటుందని ఎవరూ ఊహించలేదు, ‘బలగం’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న వేణు యెల్దండి దర్శకత్వంలో, దిల్‌రాజు సమర్పణలో రూపొందుతున్న ‘ఎల్లమ్మ’ గ్లింప్స్ సంక్రాంతి కానుకగా విడుదలై సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ గ్లింప్స్ వీడియో చూస్తుంటే దర్శకుడు వేణు యెల్దండి మరోసారి మన మట్టి వాసనను, సంప్రదాయాలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించబోతున్నారని స్పష్టమవుతోంది, గ్లింప్స్ ఆరంభంలోనే గాలిలో సుడులు తిరుగుతూ ఆకాశంలోకి ఎగిరే వేపాకు, ఆసక్తిగా చూస్తున్న మేక.. ఈ విజువల్స్ ఏదో ఒక దివ్య శక్తి రాకను సూచిస్తున్నాయి.
Also Read :Anil Ravipudi: హీరో ఎవరైనా సరే, కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గ్యారెంటీ!
గజ్జెల చప్పుడుతో ఒకరు, బూట్లతో మరొకరు పరుగెత్తుకుంటూ రావడం, ఆ వేపాకు మబ్బుల పైకి వెళ్లి అమ్మవారి రూపంగా మారడం వంటి దృశ్యాలు సినిమాలోని ఆధ్యాత్మికతను చాటిచెబుతున్నాయి. చివర్లో వర్షంలో తడుస్తూ, నడుముకు డోలు కట్టుకుని, పర్షి (Parshi) పాత్రలో దేవి శ్రీ ప్రసాద్ ఎంట్రీ ఇవ్వడం హైలైట్ అని చెప్పాలి. దశాబ్దాలుగా తన సంగీతంతో మనల్ని ఉర్రూతలూగించిన DSP, ఇప్పుడు తన నటనతో మెప్పించేందుకు సిద్ధమయ్యారు, లాంగ్ హెయిర్, షర్ట్ లేకుండా మాస్ లుక్‌లో దేవి శ్రీ ప్రసాద్ మేకోవర్ చూస్తుంటే ఆయన ఈ పాత్ర కోసం ఎంతగా శ్రమించారో అర్థమవుతోంది. పసుపు, కుంకుమ, వేపాకులు వంటి ఎలిమెంట్స్‌తో గ్లింప్స్‌ను చాలా సహజంగా, భక్తి భావం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. ఈ సినిమాకు సంగీతం కూడా DSPయే అందిస్తుండటంతో, తన డెబ్యూ కోసం ఆయన అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చుకున్నారు. ఈ సినిమా కేవలం తెలుగుకే పరిమితం కాకుండా.. తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది.