Deepika Padukone: 8 గంటల వర్క్‌డేపై దీపికకు ఇండస్ట్రీ మద్దతు.. ఇంద్రజిత్ లంకేష్ కీలక వ్యాఖ్యలు

Deepika Padukone (2)

Deepika Padukone (2)

Deepika Padukone: సినీ పరిశ్రమలో పని గంటలపై చర్చ గత కొన్ని వారాలుగా హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా తల్లైన తర్వాత కూడా నటీమణులు గంటల తరబడి షూటింగ్‌లలో పాల్గొనాల్సి రావడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోన్ ఎనిమిది గంటల పనిదినాన్ని తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆమెకు మద్దతుగా పలువురు ప్రముఖులు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నిర్మాత, జర్నలిస్ట్ ఇంద్రజిత్ లంకేష్ కూడా దీపిక అభిప్రాయాన్ని సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పని గంటల విషయంలో నటీనటులు, ముఖ్యంగా తల్లుల కోసం ప్రత్యేకమైన ప్రణాళికలు అవసరమని ఇంద్రజిత్ లంకేష్ అభిప్రాయపడ్డారు. సాధారణ ఉద్యోగులతో పోలిస్తే నటీనటులపై శారీరక, మానసిక ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. ఒక నటుడు, నటి గంటల తరబడి కెమెరా ముందే ఉండాల్సి వస్తుందని, అలసట వారి ముఖంలో స్పష్టంగా కనిపిస్తుందని వివరించారు. అందుకే షూటింగ్ షెడ్యూల్‌ను నటీనటుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేయాలని సూచించారు.

దీపికా పడుకోన్ వంటి తల్లులకు మరింత సౌకర్యవంతమైన పని గంటలు అవసరమని ఆయన స్పష్టం చేశారు. చిన్న పిల్లల సంరక్షణలో తల్లి పాత్రను ఎవరూ భర్తీ చేయలేరని, కేర్‌టేకర్లు ఉన్నా తల్లి ప్రేమకు ప్రత్యామ్నాయం ఉండదని వ్యాఖ్యానించారు. అందుకే షూటింగ్ సమయాలను కుటుంబ బాధ్యతలకు అనుగుణంగా రూపొందించడం చిత్రబృందాల బాధ్యత అని చెప్పారు.

దీపిక తెరపైకి తీసుకొచ్చిన ఎనిమిది గంటల పని అనేది మొత్తం సినీ పరిశ్రమలోని మహిళా కళాకారులందరికీ ఉపయోగపడే అంశమని ఇంద్రజిత్ లంకేష్ అభిప్రాయపడ్డారు. ఎక్కువ గంటలు పనిచేస్తే తెరపై అలసట స్పష్టంగా కనిపిస్తుందని, చివరికి ప్రేక్షకుల విమర్శలను ఎదుర్కోవాల్సింది నటీనటులేనని ఆయన పేర్కొన్నారు. దర్శకుడు కెమెరా వెనుక ఉంటారని, కానీ తెరపై కనిపించేది నటులేనని గుర్తుచేశారు.

అంతేకాదు, కార్పొరేట్ ఉద్యోగాలతో పోలిస్తే నటన మరింత శ్రమతో కూడుకున్నదని కూడా ఆయన వివరించారు. ఆఫీసుల్లో ఉద్యోగులు కూర్చుని పని చేయడంతో పాటు మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటుందని, కానీ షూటింగ్‌లో ప్రతి క్షణం శారీరక శ్రమ అవసరమవుతుందని చెప్పారు. ఈ కారణంగా నటులకు ఆరు నుంచి ఏడు గంటల పని సమయం సరిపోతుందని, ఎనిమిది గంటలు కూడా కొన్ని సందర్భాల్లో ఎక్కువ కావచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దీపికా పడుకోన్ మొదలుపెట్టిన ఈ చర్చకు సినీ పరిశ్రమలో మరింత మంది ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు. భవిష్యత్తులో ఈ చర్చ సినీ పరిశ్రమలో పని విధానాలపై ఎలాంటి మార్పులకు దారితీస్తుందో చూడాల్సి ఉంది.