కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆఫీస్ ఆవరణలో శవం దొరకడం ప్రస్తుతం సంచలనంగా మారింది. విజయ్ ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడన్న విషయం విదితమే. ఇక విజయ్ రాజకీయాల్లోకి రావాలని, ముందుగానే అతని తండ్రి, అభిమానులు కలిసి ఆయన పేరున ‘విజయ్ మక్కల్ ఇయక్కం పార్టీ’ని స్థాపిస్తూ చెన్నై శివార్లలో పార్టీ ఆఫీస్ ను కూడా నిర్మించారు. ఇక రాజకీయాలు అని కాకుండా ఏమైనా సేవా కార్యక్రమాలు ఉంటే విజయ్ ఆ ఆఫీస్ కు వెళ్తాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఒక కాంట్రాక్టు ఉద్యోగి శవమై తేలడం కలకలం సృష్టిస్తోంది. మృతుడి పేరు ప్రభాకరన్ అని తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. ఇటీవలే పార్టీ ఆఫీస్ కు కలర్ వేయించడానికి కొంతమంది పెయింటర్లను కాంట్రాక్ట్ పద్దతిలో తీసుకున్నారు. ప్రస్తుతం పెయింటింగ్ వర్క్ జరుగుతున్న సమయంలో ఇంటికి వెళ్లి వస్తానని చెప్పిన పెయింటర్ ప్రభాకరన్.. వారం తరువాత అనగా అయితే గురువారం రాత్రి పార్టీ ఆఫీస్ కు చేరుకున్నాడు. వచ్చేటప్పుడే ఫుల్ల్ గా మందుకొట్టి వచ్చిన ప్రభాకరన్ ఆకలిగా ఉందని, సూపర్ వైజర్ వద్ద రూ. 100 అడిగి తీసుకొని పరోటా తెచ్చుకున్నాడు. మధ్యలో ఏమైందో ఏమో తెలియదు కానీ శుక్రవారం ఉదయం అతడు శవమై తేలాడు. నోట్లో కుక్కిన పరోటా అలాగే ఉండడం, చేతికి కుర్మా అంటి ఉండడం లాంటివి గమనిస్తే గుండె పోటు వచ్చి మృతి చెందినట్లు పలువురు చెప్తుండగా.. మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు.