Love Story : ప్రేమ వేధింపులకు మరో యువతి బలైంది. చదువుతో పాటు అన్ని రంగాలలోనూ ఫస్ట్ ప్లేస్‌లో ఉండే ఆ యువతి.. ప్రేమ వేధింపుల కారణంగా తనువు చాలించింది. రోజు రోజుకు వేధింపులు మితిమీరుతుండటంతో.. తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఇటు వేధింపులు తట్టుకోలేక మనస్థాపానికి గురై.. చివరకు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఫోటోలో ఉన్న యువతి పేరు మౌనిక. లాలాగూడలోని రైల్వే డిగ్రీ కాలేజీలో బీఏ సెకండ్ ఇయర్ చదువుతుంది. మౌనిక కుటుంబం లాలాగూడలో నివాసం ఉంటోంది. మౌనిక తండ్రి ప్రమోద్ కుమార్ రిటైర్డ్ ఉద్యోగి… తల్లి హరిత గృహిణిగా ఉన్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది మౌనిక. ఈ ఘటనతో ఇంటిల్లిపాది ఒక్కసారిగా షాక్ అయ్యారు. అప్పటి వరకు కుటుంబ సభ్యులతో మాట్లాడిన మౌనిక, ఆత్మహత్యకు పాల్పడటంతో.. ఆ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మౌనిక ఆత్మహత్య పై పోలీసులకు కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. మౌనిక డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు..
Read Also : Neha Shetty : సన్న నడుము అందాలతో చెమటలు పట్టిస్తున్న నేహాశెట్టి
తొలుత మౌనిక ఆత్మహత్యపై కుటుంబ సభ్యులకు ఎలాంటి అనుమానాలు లేవు. కానీ మౌనిక పోస్టుమార్టం పూర్తయి.. అంత్యక్రియలు జరిగిన తర్వాత ఆమె స్నేహితులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కాలేజీకీ కొత్తగా వాలీబాల్ కోచ్ అంబాజీ అనే వ్యక్తి వచ్చాడని.. అతను తరుచూ ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడినట్లు చెప్పారు. దీంతో ఈ సమాచారాన్ని వెంటనే పోలీసులకు చేరవేశారు కుటుంబ సభ్యులు. అసలు మౌనిక ఆత్మహత్యకు కారణాలు ఏంటి? ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందోననే కోణంలో దర్యాప్తు చేయాలని కోరారు. నిజానిజాలను వెలుగులోకి తేవాలని మౌనిక తల్లి డిమాండ్ చేస్తోంది. మౌనిక కాలేజీలోనే చదువులో ఫస్ట్ అని.. అలాగే క్లాసికల్ డాన్సర్ అని స్విమ్మింగ్ కూడా చాలా బాగా చేస్తుందని మౌనిక తల్లి చెబుతోంది. అలాంటి మౌనిక ఆత్మహత్య ఎందుకు చేయాల్సికోవాల్సి వచ్చిందో మాకు తెలియాలని కోరింది..
మౌనిక ఎప్పుడు తమకు ఈ ప్రేమ వేధింపుల విషయాన్ని చెప్పలేదని ఒకవేళ అలాంటి విషయం చెప్పి ఉంటే తాము మౌనికను దక్కించుకునే వాళ్లమని సోదరుడు తెలిపారు. ఎలాంటి బైక్ నైనా ఎంతో ధైర్యంతో సునాయాసంగా నడిపే మౌనిక, ఆత్మహత్య చేసుకోవడానికి అంత బలమైన కారణాలు ఏంటో మాకు తెలియదని ఆమె తండ్రి చెబుతున్నాడు. స్నేహితులు ముందే సమాచారం ఇచ్చి ఉంటే తమ కూతుర్ని దక్కించుకునే వారమని.. అంటున్నారాయన. మౌనిక చావుకి కారణమైన అంబాజీని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాడు.
మౌనిక ఆత్మహత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమె మొబైల్ ని స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే మృతురాలి సెల్ఫోన్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ అయింది. దీంతో ఆ డేటాను రిట్రీవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం అంబాజీ పరారీలో ఉన్నాడని.. అతని కోసం గాలిస్తున్నామని చెబుతున్నారు.