Vrushakarma Trailer: గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న ‘వృషకర్మ’ ట్రైలర్‌.. పీక్స్‌కు చేరిన అంచనాలు!

Vrushakarma Official Trailer

Vrushakarma Official Trailer

Naga Chaitanya’s Vrushakarma Official Trailer: అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా, దర్శకుడు కార్తీక్ వర్మ దండు కాంబినేషన్‌లో తెరకెక్కిన యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘వృషకర్మ’. లక్కీ చార్మ్ మీనాక్షి చౌదరి హీరోయిన్. ‘విరూపాక్ష’తో ఆకట్టుకున్న కార్తీక్ ఈసారి మైథాలజీ, మిస్టరీ, థ్రిల్లర్ అంశాలను మేళవించి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 4న వృషకర్మ థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది.

బుధవారం రాత్రి నెల్లూరులోని నార్త్ రాజుపాలెంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో వృషకర్మ ట్రైలర్ ఈవెంట్ నిర్వహించారు. అక్కడ అభిమానుల కోసం ట్రైలర్‌ను ప్రత్యేకంగా ప్రదర్శించారు. అయితే ఈవెంట్‌లో ట్రైలర్ విడుదల చేసినప్పటికీ.. వెంటనే ట్విట్టర్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో అందుబాటులోకి రాలేదు. తాజాగా నాగచైతన్య తన ఎక్స్ ఖాతా ద్వారా ట్రైలర్‌ను అభిమానులతో పంచుకున్నారు. 2 నిమిషాల 56 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ఆసక్తికరమైన డైలాగ్‌తో ప్రారంభమైంది. ‘అతీంద్ర శక్తి తన బలిని ఎందుకుంది?’ అనే ప్రశ్నతో కథపై ఆసక్తి పెంచారు. ‘సృష్టి ధర్మాన్ని కాపాడటం కోసం సాక్షాత్తు ఆ దైవమే ఎంచుకున్న వృషకర్మవి నువ్వే’ అనే డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ట్రైలర్‌లోని మిగతా సంభాషణలు, యాక్షన్ సన్నివేశాలు కూడా సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఇప్పటివరకు తెలుగు తెరపై పెద్దగా స్పృశించని నేపథ్యంలో వృషకర్మను తెరకెక్కిస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మైథాలజీ, మిస్టరీ, థ్రిల్లర్ అంశాలను కలిపి దర్శకుడు కార్తీక్ దండు ఓ ఆసక్తికరమైన కథను సిద్ధం చేసినట్లు ప్రచార చిత్రం సూచిస్తోంది. నాగచైతన్య గతంలో చెప్పినట్లుగానే ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. విజువల్స్, బ్యాక్‌డ్రాప్, డైలాగ్స్ సినిమాపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నాయి. వృషకర్మ ట్రైలర్‌తో నాగచైతన్య మరో కొత్త జానర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడనే సంకేతాలు ఇచ్చారు. ట్రైలర్‌తో అంచనాలు పీక్స్‌కు చేరాయి. మరి ఈ అంచనాలను సినిమా ఎంతవరకు అందుకుంటుందన్నది చూడాలి.