Vishwak Sen: తరుణ్ భాస్కర్‌‌ను ‘ఫలక్‌నుమా దాస్’ కోసం 3 నెలలు అడుక్కున్నా..: విశ్వక్ సేన్

Vishwak Sen

Vishwak Sen

Vishwak Sen: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌ను యాక్టర్‌గా మార్చడానికి తాను ఎంతగా కష్టపడాల్సి వచ్చిందో హీరో విశ్వక్ సేన్ సరదాగా గుర్తుచేసుకున్నారు. ‘ఫలక్‌నుమా దాస్’ సినిమాలో పోలీస్ ఆఫీసర్ రోల్ కోసం తరుణ్ భాస్కర్‌ను ఏకంగా మూడు నెలల పాటు అడుక్కున్నానని విశ్వక్ చెప్పారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా విశ్వక్ మాట్లాడుతూ.. “ఫలక్‌నుమా దాస్ షూటింగ్ మొదలైనప్పుడు తరుణ్‌తో పోలీస్ క్యారెక్టర్ చేయించాలనుకున్నాను. కానీ ఎన్నిసార్లు అడిగినా ‘నేను యాక్టింగ్ చేయనురా బాబు’ అంటూ తప్పించుకునేవాడు. దాంతో ఆ పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను నెలల తరబడి వాయిదా వేస్తూ వచ్చాం. ఓరోజు రామానాయుడు స్టూడియోలో ఫోటోషూట్‌లో ఉన్న తరుణ్ దగ్గరికి వెళ్లి, చేతిలో బిస్కెట్ పెట్టి మరీ బతిమిలాడాను. నేను వదిలేలా లేనని అర్థమై చివరకు ఆ రోజు సాయంత్రానికి ఓకే చెప్పాడు” అని విశ్వక్ వివరించారు.

అప్పట్లో నటించమంటే ప్రాణం మీదికి తెచ్చుకున్న తరుణ్, ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తుండటంపై విశ్వక్ చమత్కరించారు. “అప్పుడేమో అంతలా బతిమిలాడినా చేయనన్నాడు.. ఇప్పుడేమో వరుసగా సినిమాలు చేస్తూ ఎక్కడా ఆపేలా కనిపించట్లేదు. ఎవరైనా వచ్చి అమాయకంగా ముఖం పెట్టి అడిగితే కాదనలేక ఒప్పుకునే మనస్తత్వం తరుణ్‌ది. అందుకే ఇప్పుడు చాలామంది ఆయనతో నటింపజేస్తున్నారనిపిస్తోంది. పైగా కాదనలేని క్రేజీ ఆఫర్లు కూడా ఆయనకు వస్తున్నాయి” అని విశ్వక్ సేన్ నవ్వుతూ చెప్పుకొచ్చారు. డైరెక్టర్‌గా నేషనల్ అవార్డు అందుకున్న తరుణ్ భాస్కర్, ‘ఫలక్‌నుమా దాస్’తో నటుడిగా ఎంట్రీ ఇచ్చి, ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ టైమ్ యాక్టర్‌గా దూసుకుపోతున్నారు.