టాలీవుడ్‌లో సరికొత్త ప్రతిభను వెలికితీస్తూ, నటీనటులకు శిక్షణ ఇవ్వడంలో తనదైన ముద్ర వేసుకున్న ‘వినోద్ ఫిల్మ్ అకాడమీ’ ఇప్పుడు మరో కీలక అడుగు వేసింది. కేవలం నటన నేర్పించడమే కాకుండా, తన విద్యార్థులను వెండితెరపైకి పరిచయం చేసే లక్ష్యంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. డిసెంబరు 21న రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్‌లో వినోద్ ఫిల్మ్ అకాడమీ 6వ వార్షికోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇదే వేదికపై ‘వినోద్ ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియోస్’ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు.
ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకకు సినీ పరిశ్రమలోని ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్‌ను ఆశీర్వదించారు. సీనియర్ నటులు ఎల్బీ శ్రీరామ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ప్రముఖ దర్శకులు పి. సునీల్ కుమార్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. యువ దర్శకుడు తల్లాడ సాయికృష్ణ ఈ చిత్రానికి పర్యవేక్షకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రణయ్‌రాజ్ వంగరి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ కార్యక్రమంలో జబర్ధస్త్ జీవన్, అమ్మినేని స్వప్న చౌదరి, రాజశేఖర్ ఆనింగి, డాక్టర్ సుధాకర్, ప్రొఫెసర్ విల్సన్ పాల్గొని సందడి చేశారు.
ఎల్బీ శ్రీరామ్ మాట్లాడుతూ.. “పరిశ్రమకు వచ్చే వేలాది మందికి సరైన దిశానిర్దేశం కావాలి. వినోద్ కుమార్ నువ్వుల తన అనుభవాన్ని విద్యార్థులకు పంచుతూ, వారిని క్రమశిక్షణ గల నటులుగా తీర్చిదిద్దడం చాలా గొప్ప విషయం. కొత్తగా ప్రారంభించిన సినిమా, ‘వినోదం’ పత్రిక మరిన్ని విజయాలు సాధించాలి” అని ఆకాంక్షించారు. దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. టెక్నిక్ మరియు ఎమోషన్ కలగలిసిన నటులను తయారుచేస్తున్న వినోద్ ఫిల్మ్ అకాడమీ నాణ్యతకు ఇక్కడి విద్యార్థులే నిదర్శనమని ప్రశంసించారు.
