విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ‘కింగ్‌డమ్’ చిత్రం నేడు థియేటర్లలో అడుగుపెట్టింది. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ నేడు(జూలై 31) విడుదలైన ‘కింగ్‌డమ్’ చిత్రం.. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన ‘కింగ్‌డమ్’ సినిమా వెండితెరపై ఓ కొత్త అనుభూతిని కలిగిస్తోందని, విజువల్ గా అద్భుతంగా ఉందని చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకులను మెప్పు పొందుతూ.. షో షోకి వసూళ్లను పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా పాత్రికేయుల సమావేశం నిర్వహించిన చిత్ర బృందం, తమ ఆనందాన్ని పంచుకుంది.
Also Read: Deva Katta : రాజమౌళి సినిమాతో నాకు సంబంధం లేదు.. దేవాకట్టా క్లారిటీ
ఈ సందర్భంగా కథానాయకుడు విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “కింగ్‌డమ్ సినిమాకి వస్తున్న స్పందన పట్ల మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. యూఎస్ ప్రీమియర్ల నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. రాత్రి నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. చాలా మంది ఫోన్ చేసి ‘అన్నా మనం హిట్ కొట్టినం’ అని ఎమోషనల్ అవుతున్నారు. మీ అందరి ప్రేమ వల్లే ఈ విజయం సాధ్యమైంది. మీడియా సపోర్ట్ కూడా మరిచిపోలేను. నా తెలుగు ప్రజలు నా వెనుక ఎంత ఉన్నారో నిన్నటి నుంచి చూస్తున్నా. అభిమానులు సినిమా కోసం ఎంతలా మొక్కుకున్నారో, ఎంతలా సెలబ్రేట్ చేస్తున్నారో చూస్తున్నా. ఆ వెంకన్న స్వామి ఆశీస్సులు, మీ ప్రేమ వల్లే ఇదంతా సాధ్యమైంది. ఈ విజయాన్ని ప్రేక్షకుల మధ్యలో సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది. తెలుగు ప్రేక్షకులతో పాటు యూఎస్ ఆడియన్స్ ని కూడా త్వరలో కలుస్తాను. గురువారం విడుదలంటే నేను మొదట భయపడ్డాను. కానీ, నాగవంశీ గారు ఈ సినిమా నమ్మి గురువారం విడుదల చేశారు. ఇప్పుడు ఆయన నమ్మకం నిజమైంది. సినిమాకి నా నటనకు ఇన్ని ప్రశంసలు రావడానికి కారణం దర్శకుడు గౌతమ్. టీజర్ కి వాయిస్ ఓవర్ అందించిన ఎన్టీఆర్ అన్నకి, అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు.” అన్నారు.
