తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు, అభిమానులను సంపాదించుకున్న హీరో ‘విజయ్ దేవరకొండ’. వెండితెరపై తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. నిజ జీవితంలోనూ సేవా కార్యక్రమాల ద్వారా ఎంతోమందికి అండగా నిలుస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు. తాజాగా రౌడీ హీరో విజయ్ నటించిన ‘రణబాలి’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం శుక్రవారం అనంతపురంలో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ వేడుకలో రణబాలి కో-ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వత.. విజయ్ వ్యక్తిత్వం, సేవా కార్యక్రమాలు, ఆయనపై ప్రేక్షకులకు ఉన్న అభిమానం గురించి భావోద్వేగంగా మాట్లాడారు.
విజయ్ దేవరకొండ తన సంపాదనలో కొంత భాగాన్ని సమాజ సేవకు వినియోగిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారని అనురాగ్ పర్వత గుర్తుచేశారు. ‘విజయ్ తన తొలి ఫిల్మ్‌ఫేర్ అవార్డును వేలం వేసి, ఆ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. ఆయనకు వచ్చిన గుర్తింపును కూడా ప్రజల కోసం ఉపయోగించడం విజయ్ గొప్ప మనసుకు నిదర్శనం. ఖుషి సినిమా పారితోషికంలో కోటి రూపాయలను 100 మంది పేద కుటుంబాలకు పంచి.. వారి జీవితాల్లో వెలుగులు నింపారు. కరోనా మహమ్మారి సమయంలో దేశవ్యాప్తంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో విజయ్ తనవంతుగా ప్రజలకు అండగా నిలిచారు. లాక్‌డౌన్ సమయంలో 30 వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించారు’ అని అనురాగ్ చెప్పారు.
విజయ్ దేవరకొండ వ్యక్తిత్వం గురించి అనురాగ్ పర్వత మాట్లాడుతూ.. ‘మా రౌడీ ఇంకో రకం. మా రౌడీని మీరు ప్రేమించవచ్చు లేదా ద్వేషించవచ్చు.. కానీ ఆయన్ని ఎవరూ విస్మరించలేరు. మా రౌడీ హేట్ మీటర్ చాలా తక్కువ. రౌడీని యూత్ మాత్రమే కాదు.. ప్రతి ఫ్యామిలీ ఓన్ చేసుకుంది. ఇలాంటి రౌడీ ప్రతి ఇంట్లో ఉండాలని తల్లి కోరుకుంటుంది. తన కొడుకు కూడా ఇలా రౌడీలా బయటికి వెళ్లి అనుకున్నది సాధించాలి.. ఏది ఎదురొచ్చినా ఆగకూడదు.. బయట బతకడం నేర్చుకోవాలి.. అలాంటి రౌడీ నాకుండాలని ప్రతి తండ్రి కోరుకుంటున్నాడు. ఈ రౌడీని మీరందరూ ఓన్ చేసుకుని ఇంత మంచి విజయం అందించినందుకు థాంక్స్’ అంటూ అనురాగ్ పర్వత అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

