విజయ దేవరకొండ కథానాయకుడిగా ప్రతిభగల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘VD12’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘కింగ్‌డమ్’ అనే శక్తివంతమైన టైటిల్ ను ఖరారు చేసినట్లు తాజాగా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. టైటిల్ తో పాటు బుధవారం నాడు టీజర్ ను కూడా ఆవిష్కరించారు నిర్మాతలు. ‘కింగ్‌డమ్’ టీజర్ అద్భుతంగా ఉంది. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు, కట్టిపడేసే భావోద్వేగాలతో థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించే యాక్షన్ డ్రామాగా ‘కింగ్‌డమ్’ రూపొందుతోందని టీజర్ తో స్పష్టం చేశారు. ఈ ఇంటెన్స్ టీజర్ తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
‘కింగ్‌డమ్’ టీజర్ తెలుగు వెర్షన్‌కి జూనియర్ ఎన్టీఆర్, తమిళ వెర్షన్‌కి సూర్య, హిందీ వెర్షన్‌కి రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ అందించారు. ఈ ముగ్గురు స్టార్లు తమ గొంతుతో రోమాలు నిక్కబొడుచుకునేలా చేసి, టీజర్‌ను మరో స్థాయికి తీసుకువెళ్లారు. ‘కింగ్‌డమ్’ చిత్రానికి విజయ్ దేవరకొండ ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు. సినిమాని వేరే స్థాయికి తీసుకొని వెళ్ళడానికి తన వైపు నుంచి నూటికి నూరు శాతం కృషి చేస్తున్నారు. విజయ్ సినిమాకి సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తే, దేశవ్యాప్తంగా సినీ ప్రియుల దృష్టి ఉండటం సహజం. ‘కింగ్‌డమ్’ టీజర్ విడుదల తేదీ ప్రకటన వచ్చిన దగ్గర నుంచి, ఈ టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూశారు. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా టీజర్ కట్టిపడేసింది. విజయ్ తన స్టార్‌డమ్‌కి తగిన సరైన కథ వస్తే.. ఏం చేయగలరో కేలవం టీజర్ తోనే రుజువు చేశారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండను పూర్తిగా సరికొత్త అవతార్‌లో చూపిస్తున్నారు. ‘కింగ్ డమ్’ టీజర్ విజయ్ అభిమానులను సంతృప్తి పరచడమే కాకుండా, సాధారణ ప్రేక్షకులలోనూ సినిమా చూడాలనే ఆసక్తిని మరింత పెంచింది. 2025, మే 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో ‘కింగ్‌డమ్’ విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. విడుదల తర్వాత ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరికొత్త సంచలనాలు సృష్టించి, ఘన విజయం సాధిస్తుందని నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు. సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.