Varanasi Release Date Rumors: సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్‌వరల్డ్ చిత్రం ‘వారణాసి’పై ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ సినిమాను 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. అయితే విడుదల తేదీ దగ్గరపడుతున్నా.. ఇప్పటివరకు ప్రచార కార్యక్రమాలు ప్రారంభం కాకపోవడం, నిర్మాణానంతర పనులు ఇంకా కొనసాగుతుండటంతో వారణాసి అనుకున్న సమయానికి థియేటర్లలోకి వస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విశ్వసనీయ సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా విడుదల తేదీపై మరో పది రోజుల్లో స్పష్టత ఇవ్వాలని రాజమౌళి, చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే వారణాసి చిత్రీకరణ పూర్తి కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్ పనులు ఉండటంతో వాటిని పూర్తి చేయడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ మొదటి వారం నుంచి డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు సినిమా నాణ్యత విషయంలో రాజమౌళి ఎక్కడా రాజీపడకూడదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అనుకున్న విడుదల తేదీకి సినిమా సిద్ధం కాకపోతే వాయిదా వేసేందుకైనా ఆయన సిద్ధంగా ఉన్నారనే చర్చ నడుస్తోంది. భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాను రూపొందిస్తున్న నేపథ్యంలో తొందరపడి విడుదల చేయడం కంటే.. ప్రతి సన్నివేశాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే రిలీజ్ విషయంపై ఇంకో పది రోజుల్లో స్పష్టత ఇవ్వాలనే ఆలోచనలో చిత్రబృందం ఉందని సమాచారం. రిలీజ్ విషయంలో క్లారిటీ రావాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఏప్రిల్ 7 2027న సినిమా విడుదలవుతుందా? లేదా విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం మరింత సమయం తీసుకుంటారా? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. కేఎల్ నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన ప్రియాంక చోప్రా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాత్రల పరిచయాలు సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలను పెంచాయి.

