Site icon NTV Telugu

Director Vamsi: వంశీ ‘పసలపూడి కథలు’పై పరిశోధనకు డాక్టరేట్

Pasalpudi]

Pasalpudi]

 

ప్రముఖ దర్శకులు వంశీకి తెలుగు సినీ చరిత్రలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. కె. విశ్వనాథ్‌, బాపు, దాసరి, రాఘవేంద్రరావు తరహాలోనే వంశీ ది కూడా ఓ భిన్నమైన శైలి. వంశీ మార్కు చిత్రాల కోసం నేటికీ ఎదురు చూసే లక్షలాది సినిమా అభిమానులు ఉన్నారు. విశేషం ఏమంటే… దర్శకుడిగా మెగా ఫోన్ చేతిలోకి తీసుకోకముందు నుండే వంశీ ఓ గొప్ప రచయిత. ఆయన రాసిన కథలు, నవలలు పలు వార, మాస పత్రికలో ప్రచురితమయ్యాయ. బహుమతులూ పొందాయి. తాను రాసిన ‘మహల్లో కోకిల’ నవలే ‘సితార’ పేరుతో సినిమాగా తీశారు వంశీ. ఆయన సొంతూరు తూర్పు గోదావరి జిల్లా లోని పసలపూడి. ఆ ఊరంటే వంశీకి అమితమైన ఇష్టం. అలానే గోదావరిని వంశీని కూడా విడిదీసి చూడలేం. ఆయన కథల్లోనూ, చిత్రాల్లోనూ గోదావరికి ఎంతో ప్రాధాన్యముంటుంది. అలాంటి వంశీ సొంతూరు పసలపూడి నేపథ్యంలో ‘పసలపూడి కథలు’ రాశారు. ఇవి విశేషమైన పాఠకాదరణ పొందాయి.

వంశీ పసలపూడి సమీప గ్రామం ‘గొల్లల మామిడాడ’కు చెందిన కె. రామచంద్రరెడ్డి 24 సంవత్సరాలుగా డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్ గా పని చేస్తున్నారు. ఆయనకు పసలపూడి కథలంటే ఎంతో ఇష్టం. అందుకు తన పి.హెచ్.డి. పరిశోధనాంశంగా దానినే ఎంచుకున్నారు. గోదావరి తీరానికే చెందిన ఆయనకు అక్కడియాస, భాష, మాండలికంపై అవగాహన ఉంది. దాంతో పెద్ద ఇబ్బంది లేకుండా తనపరిశోధనను విజయవంతంగా పూర్తి చేసి ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పొందారు. తన పరిశోధనను మొత్తం ఏడు అధ్యాయాలుగా విభజించారు రామచంద్రారెడ్డి. వాటిలో రచయితతో ముఖాముఖితో పాటు బాపు – రమణల ప్రశంసా కవిత, వంశీ కథలకు బాపు గీసిన బొమ్మలు, కథల్లోని ప్రాంతాల ఫోటోలతో పాటు పలు ఆసక్తికరమైన అంశాలను పొందుపరిచారు.

ప్రస్తుతం ఇజ్రాయిల్‌లోని హిబ్రూ యూనివర్సిటీ ఈఆర్సీ – నీమ్ ప్రాజెక్టులో కె. రామచంద్రారెడ్డి సభ్యుడిగా ఉన్నారు. ‘అమెరికా అట్లాంటా’లోని ఎమొరీ యూనివర్సిటీలో జరిగిన కాన్ఫరెన్స్‌లో పాల్గొని పరిశోధన పత్రాన్ని సమర్పించారు. ఇంకా పలు అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర సెమినార్లలో పాల్గొని రీసెర్చ్ పేపర్లు స‌బ్‌మిట్‌ చేశారు. ‘తూర్పుగోదావరిజిల్లా… సమగ్ర సాహిత్యం’ అనే బృహత్ సంపుటానికి, ‘తూర్పు గోదావరి జిల్లా కథలు… అలలు’ అనే కథా సంపుటికి సహ సంపాదకుడిగా ఆయన పని చేశారు. ‘రంగుల నింగి’ అని 1998లో హైకూ సంపుటాన్ని వెలువరించారు. తెలుగు హైకూల్లో సామాజిక అనే అంశంపైఎంఫిల్ చేశారు.

 

Exit mobile version