పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రానికి అన్ని చోట్లా అద్భుతమైన స్పందన లభిస్తోంది. అయితే ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. దీనికి కారణం కరోనా. మన తెలుగు సినిమాకు పక్క రాష్ర్టాల్లో కూడా చక్కటి ఆదరణ లభిస్తూ ఉంటుంది. అలా తెలుగు సినిమాలు ఒడిశా రాష్ట్రంలో పలు చోట్ల రిలీజ్ అవుతుంటాయి. ప్రధానంగా శ్రీకాకుళం సరిహద్దులో ఉండే పర్లాకిమిడి పట్టణంలో ప్రతీ తెలుగు సినిమా రిలీజ్ అవుతుంది. ఇక్కడ తెలుగు వారి శాతం ఎక్కవగా ఉండటమే అందుకు కారణం. తాజాగా ‘వకీల్ సాబ్’ సినిమా కూడా పర్లాకిమిడిలోని ‘జై మా’ ‘లక్ష్మీ’ థియేటర్లలో విడుదలైంది. సినిమాకు మంచి టాక్ రావటంతో పాటు పవన్ కళ్యాణ్ హీరో కావటంలో సినిమా చూడటానికి ప్రేక్షకులు ఎగబడ్డారు.
నిజానికి ఒడిస్సాలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. దీంతో పలు జిల్లాల్లో 50 శాతం సీటింగ్ కెపాసిటీతో థియేటర్లు నడవాలని అధికారులు ఆదేశించారు. అందులో పర్లాకిమిడి పట్టణం కూడా ఉంది. అయితే జనాల రద్దీ తట్టుకోలేక ‘వకీల్ సాబ్’ సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్ల యజమానులు నిబంధనలు ఉల్లంఘించి నూటికి నూరుశాతం టికెట్లు ఇచ్చేసారట. ఈ విషయం తెలుసుకున్న అధికారులు రంగంలోకి దిగి… కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన నేరానికి ‘జై మా, లక్ష్మీ టాకీస్’ థియేటర్లను సీజ్ చేశారు. అంతే కాదు ఆ థియేటర్ల యజమానులకు రూ.10 వేల చొప్పున జరిమానా కూడా విధించారట.
‘వకీల్ సాబ్’ థియేటర్లు సీజ్
