Marriage Rumours: ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు కలిసి ఒకటి రెండు సినిమాలు చేశారంటే చాలు.. వారి మధ్య ఏదో నడుస్తోందంటూ గుసగుసలు మొదలవడం సర్వసాధారణం. డేటింగ్, లవ్‌లో ఉన్నారంటూ పుట్టుకొచ్చే రూమర్లు కొన్నాళ్లపాటు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంటాయి. తాజాగా ఎన్టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ వైష్ణవి చైతన్య.. తన కో-స్టార్ ఆనంద్ దేవరకొండతో రిలేషన్‌షిప్‌పై వస్తున్న వార్తలకు, పెళ్లి రూమర్లకు ఒక్కసారిగా ఫుల్‌స్టాప్ పెట్టారు. ఆనంద్ దేవరకొండతో ప్రేమాయణం నడుపుతున్నారంటూ వస్తున్న వార్తలపై ఈ ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్నించగా వైష్ణవి నిర్మొహమాటంగా స్పందించారు. “మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్‌షిప్ లేదు. మేమిద్దరం కేవలం కో-స్టార్స్, మంచి ఫ్రేండ్స్ మాత్రమే. మా మధ్య దాదాపు కొన్నేళ్లుగా మంచి ట్రావెల్ ఉంది. బయట వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు” అని కుండబద్దలు కొట్టారు. అంతేకాకుండా, ఆనంద్ రెండు – మూడేళ్లలో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నాడని, తన పెళ్లికి ఇంకా చాలా టైం ఉందని చెబుతూ, తమ బంధంపై వస్తున్న ఊహాగానాలను పూర్తిగా కొట్టిపారేశారు.
జీవితంలో ఎదురయ్యే సంక్లిష్ట పరిస్థితులను ఎలా దాటాలనే అంశంపై ఆమె స్పందిస్తూ.. “ఎలాంటి గడ్డు పరిస్థితి వచ్చినా దాన్ని అంగీకరించడం, ఓర్పు వహించడం, ఆశతో ముందడుగు వేయడం చాలా ముఖ్యం. మనల్ని మనం నమ్ముకుంటూ ప్రశాంతంగా ఉంటే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులనైనా అధిగమించవచ్చు” అన్నారు. తన అందం, లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుతూ.. వర్కవుట్లు అంటే తనకు ఎంతో ఇష్టమని, అయితే ఫుడ్ విషయంలో పెద్దగా కఠినంగా ఉండనని అన్నారు. చికెన్, ఎగ్స్‌తో పాటు స్వీట్స్ కూడా ఇష్టంగా తింటానని, తనకు నచ్చిన ఫుడ్ తింటూనే వర్కవుట్స్‌తో ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటానని చెప్పుకొచ్చారు. విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతున్న ఈ భామ, పెళ్లి రూమర్లను సున్నితంగా కొట్టిపారేసిన విధానం ఇప్పుడు నెటిజన్లను, సినీ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటోంది.

