విశాఖ స్టీల్ ప్లాంట్ పై నీలినీడలు అలుముకున్న నేపథ్యంలో సత్యారెడ్డి తానే ప్రధాన పాత్ర పోషిస్తూ, స్వీయ దర్శకత్వంలో ‘ఉక్కు సత్యాగ్రహం’ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం ప్రజా యుద్థ నౌక గద్దర్ ఓ పాటను రాసి, పాడారు. ‘సమ్మె నీ జన్మహక్కురన్నో’ అనే ఈ లిరికల్ వీడియో పాటను మే డే సందర్భంగా గద్దర్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ పాటను సత్యారెడ్డితో పాటు ఇతర నటీనటులపై చిత్రీకరించారు. ఇప్పటికే వైజాగ్ లో తొలి షెడ్యూల్ పూర్తి చేశామని, అక్కడే ఈ పాటను చిత్రీకరించామని సత్యారెడ్డి అన్నారు. కరోనా ఉధృతి తగ్గిన తర్వాత మరో షెడ్యూల్ మొదలు పెడతామని చెప్పారు. ఈ సినిమాలో 13 నిమిషాల పాటు సాగే మరో పాట ఉందని, దానిని గద్దర్ పాడుతున్నారని, ఆయన మీదే ఆ పాటను చిత్రీకరిస్తామని సత్యారెడ్డి తెలిపారు. సుద్దాల అశోక్ తేజ, గోరేటి వెంకన్న, చంద్రబోస్ ఇందులోని మిగతా పాటలు రాస్తున్నారని, ఈ సినిమాలో విశాఖ స్టీల్ ప్లాంట్ యూనియన్ నాయకులు, రాజకీయ ప్రముఖులకు కూడా నటించబోతున్నారని సత్యారెడ్డి చెప్పారు. ఓ మంచి ఉద్యమ చిత్రాన్ని ఉద్యమ కాలంలో తీస్తున్న సత్యారెడ్డిని గద్దర్ ఈ సందర్భంగా అభినందించారు.
‘ఉక్కు సత్యాగ్రహం’ పాట ఆవిష్కరించిన గద్దర్!
