Trivikram Srinivas: స్టార్ హీరో సూర్య హీరోగా, డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా మంచి రెస్పాన్స్‌తో థియేటర్స్‌లో దూసుకెళ్తోంది. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సూపర్ సక్సెస్‌ను పురస్కరించుకుని చిత్రబృందం తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కథను వెంకీ అట్లూరి తనకు మొదటిసారి చెప్పినప్పటి నుంచే ఈ సినిమా తనకు ఎంతో దగ్గరైందని త్రివిక్రమ్ తెలిపారు. ట్రెండ్‌కు భిన్నంగా ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన సినిమా రూపొందించి, దాన్ని సక్సెస్ చేసినందుకు డైరెక్టర్ వెంకీ అట్లూరితో పాటు మొత్తం చిత్రబృందాన్ని ఆయన అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హీరో సూర్యతో సినిమా చేయాలనే తన కోరిక గురించి చెప్పారు. ఇప్పటికే సూర్యకు ఓ కథ చెప్పానని, అయితే అది ఆయనకు నచ్చేలా చెప్పలేకపోయానని వెల్లడించారు. త్వరలోనే సూర్యతో కలిసి తప్పకుండా సినిమా చేస్తాననే నమ్మకం ఉందన్నారు. అంతేకాదు.. సూర్యతో సినిమా చేయాలని తన భార్య నుంచి తనకు డిమాండ్ ఉందని సరదాగా చెప్పారు. ఆమె సూర్యకు పెద్ద అభిమానినని, సాధారణంగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ షూటింగ్స్‌కు వెళ్లని ఆమె.. సూర్య సినిమా షూటింగ్ జరుగుతోందని తెలిసి ప్రత్యేకంగా సెట్‌కు వచ్చి హీరోను కలిశారని గుర్తుచేశారు. సూర్యలో వయసు తగ్గుతున్నట్లుగా కనిపించే ప్రత్యేకత ఉందని త్రివిక్రమ్ ప్రశంసించారు. తనకు తెలిసి సూర్య, మహేష్ బాబు ఇద్దరికీ వయసు వెనక్కి ప్రయాణిస్తున్నట్లుగా అనిపిస్తుందని అన్నారు. ‘గజిని’లోని సంజయ్ రామస్వామి పాత్రను కూడా తాను ఎంతో ఇష్టపడతానని, ఆ పాత్ర తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో దగ్గరైందని చెప్పారు.
‘విశ్వనాథ్ అండ్ సన్స్’లో సూర్యతో పాటు రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్, మమితా బైజు కీలకమైన నాలుగు స్తంభాలుగా నిలిచారని త్రివిక్రమ్ పేర్కొన్నారు. ముఖ్యంగా రవీనా టాండన్ ఇప్పటివరకు కనిపించిన ఇమేజ్‌కు భిన్నంగా ఎంతో సున్నితమైన పాత్రలో అద్భుతంగా నటించారని ప్రశంసించారు. మమితా బైజు పాత్ర కూడా ఎంతో ఎనర్జిటిక్‌గా, అదే సమయంలో చాలా కష్టమైనదిగా ఉందని.. ఆమె అద్భుతంగా పండించారని అన్నారు. డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాను తెరకెక్కించేందుకు ఎంతో కష్టపడ్డారని, కథను రాయడం నుంచి తెరపైకి తీసుకురావడం వరకు ఆయన కష్టం స్పష్టంగా కనిపించిందని ప్రశంసించారు. ముఖ్యంగా సినిమాలోని కొన్ని సన్నివేశాలు భవిష్యత్తులో ఐకానిక్‌గా నిలిచే అవకాశం ఉందని చెప్పారు. అలాగే సూర్యతో పాటు కార్తి కూడా తెలుగు హీరోలేనని త్రివిక్రమ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం భారతీయ సినిమా ఒకే వేదికపైకి వచ్చిందని, భాషలు, ప్రాంతాల మధ్య ఎలాంటి గోడలు లేవని అన్నారు. చిన్న చిన్న ప్రాంతీయ విభేదాల గురించి మాట్లాడకుండా ప్రపంచ వేదికపై భారతీయ సినిమా సత్తాను చాటేందుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సినిమాను సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ చిత్రబృందం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

