The Paradise: తెలంగాణ ఫేవరెట్ ‘సర్వపిండి’.. ‘ది ప్యారడైజ్‌’ ఇంటర్వెల్‌లో స్పెషల్ ట్రీట్!

The Paradise Interval Sarvapindi

The Paradise Interval Sarvapindi

Sarvapindi to Be Served at The Paradise Movie Interval: ‘ది ప్యారడైజ్‌’.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ సినిమా గురించే పెద్ద చర్చ. నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్‌ ఓదెల కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ పీరియాడిక్‌ యాక్షన్ థ్రిల్లర్‌లో నానికి జోడీగా గ్లామర్ డాల్ కయాదు లోహర్‌ నటించగా.. మోహన్‌బాబు, సోనాలి కులకర్ణి, రాఘవ్‌ జుయల్‌ కీలక పాత్రలు పోషించారు. ప్యారడైజ్‌ మూవీ రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా.. ఈరోజు ప్రీమియర్స్ పడనున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ది ప్యారడైజ్‌ సినిమాకు వచ్చిన ప్రేక్షకులకు థియేటర్లలో మరింత ప్రత్యేకమైన అనుభూతిని అందించేలా తెలంగాణలో ఫేమస్ స్నాక్‌ను ఇంటర్వెల్ సమయంలో అందించేందుకు మైత్రీ థియేటర్స్ సిద్ధమైంది. తెలంగాణ సంప్రదాయ వంటకాల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న సర్వపిండిని ప్యారడైజ్ మూవీని ప్రదర్శించే కొన్ని థియేటర్లలో ఇంటర్వెల్ స్నాక్‌గా అందించనున్నట్లు మైత్రీ థియేటర్స్ ప్రకటించింది. తెలంగాణ రుచిని ప్రేక్షకులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక ఏర్పాటును చేస్తున్నట్లు తెలిపింది.

మైత్రీ విమల్, మైత్రీ శివ గంగా థియేటర్లలో ఇంటర్వెల్ సమయంలో సర్వపిండిని అందించనున్నట్లు మైత్రీ థియేటర్స్ పోస్టర్ ద్వారా వెల్లడించింది. ఓ 77 ఏళ్ల బామ్మ సర్వపిండిని తయారుచేయనున్నారు. సినిమా విడుదల సమయంలో ప్రేక్షకులకు కేవలం తెరపై వినోదం మాత్రమే కాకుండా.. స్థానిక సంస్కృతి, ఆహారపు రుచిని కూడా పరిచయం చేయాలనే ప్రయత్నంను మైత్రీ చేస్తోంది. తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన సర్వపిండిని థియేటర్లలో అందించడంపై సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.