Paradise Second Single: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో అభిమానుల్లో ఈ చిత్రంపై భారీ క్రేజ్ నెలకొంది. తాజాగా ఈ మూవీ సెకండ్ సింగిల్ లాంచ్‌కు మేకర్స్ సరికొత్త ప్లాన్ చేశారు. సాధారణంగా సినిమాల నుంచి పాటలను ఈవెంట్లు నిర్వహించి విడుదల చేస్తుంటారు. కానీ ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్‌ను మాత్రం ఏకంగా అనిరుధ్ రవిచందర్ లైవ్ కాన్సర్ట్‌లో ఆవిష్కరించనున్నారు. ఆగస్టు 28న అమెరికాలోని డల్లాస్‌లో జరగనున్న అనిరుధ్ కాన్సర్ట్ వేదికగా ఈ పాటను అభిమానుల ముందే లైవ్‌గా విడుదల చేయబోతున్నట్లు తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందుకోసం నాని ఇప్పటికే డల్లాస్ చేరుకున్నారు.
అనిరుధ్ నిర్వహిస్తున్న భారీ మ్యూజిక్ కాన్సర్ట్‌లో ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్‌ను ప్రేక్షకుల సమక్షంలో ఆవిష్కరించనుండటంతో ఈ లాంచ్‌పై ఆసక్తి మరింత పెరిగింది. లైవ్ లాంచ్ అనంతరం మరుసటి రోజే ఈ పాటను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ సాంగ్ మోత మోగించేలా ఉంటుందని మేకర్స్ హైప్ పెంచుతున్నారు. ఇప్పటికే ‘ది ప్యారడైజ్’ నుంచి విడుదలైన ‘ఆయా షేర్’ పాట యూట్యూబ్‌లో మంచి స్పందన సొంతం చేసుకుంది. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్‌తో కలిసి ఉన్న ఫొటోను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసి సెకండ్ సింగిల్‌పై మరింత హైప్ పెంచారు. ఈ చిత్రంలో నాని సరసన కయాదు లోహార్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మోహన్ బాబు, రాఘవ్ జుయల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 1980ల నాటి సికింద్రాబాద్ బస్తీల నేపథ్యాన్ని తీసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. హక్కుల కోసం పోరాడే ఓ తెగ చుట్టూ ఈ సినిమా కథ సాగుతుందని తెలుస్తోంది. పీరియడ్ బ్యాక్‌డ్రాప్, మాస్ యాక్షన్, ఎమోషన్ కలగలిపి శ్రీకాంత్ ఓదెల తనదైన శైలిలో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇటీవల విడుదలైన ‘ది ప్యారడైజ్’ టీజర్ కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. 1 నిమిషం 42 సెకన్ల నిడివితో వచ్చిన ఈ టీజర్‌లో సరికొత్త యాక్షన్ ప్రపంచాన్ని పరిచయం చేయడంతో పాటు నాని మాస్ అవతార్‌ను చూపించారు. దీంతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. కాగా ‘ది ప్యారడైజ్’ 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో 8 భాషల్లో విడుదల కానుంది. మరి డల్లాస్‌లో అనిరుధ్ కాన్సర్ట్ వేదికగా లాంచ్ కానున్న సెకండ్ సింగిల్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

