The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..

The Odyssey

The Odyssey

The Odyssey: ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ నుంచి సినిమా వస్తుందంటేనే సినీ అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్నంటుతాయి. తన ప్రతి సినిమాతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించే నోలన్.. ఈసారి దాదాపు 3,000 ఏళ్ల పురాతన గ్రీకు ఇతిహాసం ‘ది ఒడిస్సీ’ని అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిగా ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. సుమారు మూడు గంటల నిడివితో తెరకెక్కిన ఈ చిత్రం స్టార్టింగ్ నుంచే ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుందని చెబుతున్నారు. విజువల్స్, ఎమోషన్స్, యాక్షన్, మైథాలజీ అంశాల సమ్మేళనంగా రూపొందిన ఈ సినిమా హాలీవుడ్‌లో మరో మైలురాయిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ చిత్రంలో ఒడిస్సియస్ పాత్రలో నటించిన మాట్ డామన్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ నటనను కనబరిచారని సినీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి. యుద్ధ వీరుడిగానే కాకుండా, తప్పులు చేసే సాధారణ మనిషిగా, కుటుంబం కోసం తపించే భర్తగా, తన తెలివితేటలతో ప్రతి సవాలును ఎదుర్కొనే నాయకుడిగా ఆయన పాత్రను ఈ సినిమాలో అద్భుతంగా ఆవిష్కరించారట. ట్రోజన్ హార్స్ నుంచి తప్పించుకోవడం, సిర్సే వంటి మాయాజాలాల నుంచి తన సైన్యాన్ని రక్షించడం వంటి సన్నివేశాల్లో ఆయన నటన హైలెట్‌గా నిలుస్తుందని చెబుతున్నారు. ఇక టామ్ హాలండ్ ఈ మూవీలో టెలిమాకస్ పాత్రలో పూర్తిగా కొత్త కోణంలో కనిపించనున్నారట. స్పైడర్‌మ్యాన్ ఇమేజ్‌కు భిన్నంగా, తండ్రి కోసం ఎదురు చూసే యువకుడిగా ఆయన నటన ప్రేక్షకులను కదిలిస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా తన తండ్రి గురించి విన్న తర్వాత భావోద్వేగానికి గురయ్యే ఒక సన్నివేశం ఈ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని పేర్కొంటున్నారు.

పెనెలోప్ పాత్రలో యాన్ హాతవే తన అద్భుతమైన నటనతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారని చెబుతున్నారు. భర్త కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూస్తూనే రాజ్యాన్ని కాపాడే ధైర్యవంతురాలైన రాణిగా ఆమె భావోద్వేగాలను ఎంతో సహజంగా పలికించారని అంటున్నారు. మరోవైపు జెండయా స్క్రీన్ టైమ్ తక్కువే అయినప్పటికీ, కనిపించిన ప్రతిసారి తన ప్రత్యేకమైన ఉనికితో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని టాక్. రాబర్ట్ ప్యాటిన్సన్ మరోసారి తన నటనతో ప్రత్యేక ముద్ర వేశారట. ప్రతి సన్నివేశంలో ఉత్కంఠను పెంచే పాత్రలో ఆయన ఈ చిత్రంలో కనిపించబోతున్నారట. అలాగే ఇలియట్ పేజ్, లుపిటా న్యోంగో, చార్లీజ్ థెరాన్, జాన్ బెర్న్‌థాల్, నిఖిల్ పటేల్ వంటి నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని చెబుతున్నారు. పెద్ద తారాగణం ఉన్నప్పటికీ ప్రతి పాత్రకు సరైన ప్రాధాన్యత ఇవ్వడంలో నోలన్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారని అంటున్నారు. మొత్తంగా చూస్తే ‘ది ఒడిస్సీ’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదని.. ఒక విజువల్ గ్రాండియర్, భావోద్వేగ కథనం, అద్భుతమైన నటన, సాంకేతిక నైపుణ్యం కలిసిన అరుదైన సినిమాటిక్ అనుభవంగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. క్రిస్టోఫర్ నోలన్ మరోసారి తన డైరెక్షన్ మ్యాజిక్‌తో ప్రపంచ సినీ ప్రేక్షకులకు గుర్తుండిపోయే చిత్రాన్ని తెరకెక్కించారని చెబుతున్నారు.