Film Federation: ఆ 20 శాతం వాటా ఇవ్వాల్సిందే.. బడా నిర్మాతలకు అల్టిమేటం!

Film Federation President Anil

Film Federation President Anil

ప్రభుత్వ జీవో ప్రకారం టికెట్ ధరలు పెంచుకున్న సినిమాల నుంచి సినీ కార్మికుల సంక్షేమ నిధికి రావాల్సిన 20 శాతం వాటాపై తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ తీవ్రంగా స్పందించింది. నేడు జరిగిన అత్యవసర కౌన్సిల్ సమావేశంలో కార్మికుల సంక్షేమానికి సంబంధించిన నిధుల వసూలు అంశం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఇచ్చిన టికెట్ హైక్ జీవో ప్రకారం, పెరిగిన ధరల నుంచి వచ్చే మొత్తంలో 20 శాతాన్ని సినీ కార్మికుల వెల్ఫేర్ అకౌంట్‌కు జమ చేయాల్సి ఉంది. అయితే ఇటీవల టికెట్ ధరలు పెంచుకున్న ఐదు భారీ చిత్రాలలో కొన్ని ప్రాజెక్ట్‌లు ఈ మొత్తాన్ని ఇంకా చెల్లించలేదని ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని వెల్లడించారు.

ఈ బకాయిలను వెంటనే వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ నిబంధన భాషతో సంబంధం లేకుండా అందరికీ వర్తిస్తుందని ఫెడరేషన్ స్పష్టం చేసింది. తెలుగు సినిమాలతో పాటు ఇక్కడ టికెట్ ధరల పెంపు ప్రయోజనాన్ని పొందిన తమిళ, కన్నడ డబ్బింగ్ చిత్రాల నిర్మాతలు కూడా ఖచ్చితంగా 20 శాతం నిధిని కార్మికుల అకౌంట్‌కు జమ చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. కార్మికుల హక్కులను, సంక్షేమాన్ని కాపాడే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఫెడరేషన్ నేతలు పేర్కొన్నారు.