‘పెళ్లిచూపులు’ చిత్రంతో దర్శకుడిగా తనదైన ముద్ర వేసి, ఆ తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది?’, ‘కీడా కోలా’ వంటి విభిన్న చిత్రాలతో గుర్తింపు పొందిన తరుణ్ భాస్కర్… ‘అంతకుముందు ఆ తర్వాత’, ‘అమీతుమీ’, ‘అరవింద సమేత’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సొగసైన నటి ఈషా రెబ్బతో ప్రేమాయణం నడుపుతున్నట్లు గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని, వీరి ప్రేమ ప్రయాణం పెళ్లి వైపు అడుగులు వేస్తోందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలోనే, వీరిద్దరూ వచ్చే ఏడాది (2026) వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Also Read:Lionel Messi: మెస్సీ ఈవెంట్ మేనేజర్ అరెస్ట్.. ఎవరీ సతద్రు దత్తా
తరుణ్ భాస్కర్ ప్రస్తుతం దర్శకత్వంతో పాటు నటుడిగా కూడా రాణిస్తున్నారు. ఈషా రెబ్బతో కలిసి ఆయన ‘ఓం శాంతి శాంతి శాంతిః’ అనే మలయాళ రీమేక్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లోనే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి, అది ప్రేమగా మారిందనే ప్రచారం సినీ వర్గాలలో బలంగా ఉంది. వరంగల్ ప్రాంతానికి చెందిన ఈ ఇద్దరి మధ్య ప్రాంతీయ బంధం కూడా వీరిని మరింత దగ్గర చేసిందని చెబుతున్నారు. ఇటీవల ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా వచ్చిన తరుణ్ భాస్కర్, యాంకర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, తన జీవితంలో గొప్ప ప్రేమకథ ఇప్పుడే నడుస్తోందని పరోక్షంగా చెప్పడం, ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. విశ్వక్ సేన్ ఇంట్లో జరిగిన దీపావళి వేడుకలతో పాటు పలు ఈవెంట్లలో వీరిద్దరూ కలిసి కనిపించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, దీంతో వీరి రిలేషన్‌షిప్ గురించి అభిమానులలో స్పష్టత వచ్చింది.
Also Read:Thaman: తమిళ్ ఫీలింగ్ ఎక్కువ.. అనిరుధ్‌తో పోలిక.. థమన్ సంచలన వ్యాఖ్యలు!
ఈ వార్తల నేపథ్యంలో, తరుణ్ భాస్కర్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి. ఆయనకు ఇదివరకే పెళ్లై, విడాకులు తీసుకున్నట్లుగా కొన్ని కథనాలు ప్రచురితమయ్యాయి. అయితే, దీనిపై తరుణ్ భాస్కర్ గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో, ఈ కొత్త బంధంపై, తరుణ్ భాస్కర్ మొదటి వివాహబంధం గురించి అభిమానులు మరింత లోతుగా తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం తరుణ్ తన తల్లితో కలిసి ఉంటున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి తరుణ్ భాస్కర్ లేదా ఈషా రెబ్బ వైపు నుంచి ఈ పెళ్లి గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, ఇండస్ట్రీలో వీరి పెళ్లి కబురు దృఢంగా వినిపిస్తోంది. ఇద్దరూ తమ వృత్తి జీవితంలో బిజీగా ఉంటూనే, వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. వారిద్దరి నుంచి అధికారిక ప్రకటన వస్తే ఈ శుభవార్తపై మరింత స్పష్టత వస్తుంది.