NTV Telugu Site icon

ఫ్యామిలీ మ్యాన్ 2 బ్యాన్ : కేంద్రానికి తమిళ్ సర్కార్ లేఖ!

Tamil Nadu government asks for ban on The Family Man 2

ఫ్యామిలీ మ్యాన్ సెకండ్ సీజ‌న్ అనుకున్న ప్ర‌కారం జూన్ 4న రిలీజ‌వుతుందా ? అంటే ఇప్పుడు ఏమీ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఈ సిరీస్ మీద చెలరేగిన వివాదం అంతకంతకూ పెద్ద‌ద‌వుతోంది. ఈ సిరీస్‌లో సమంత పోషించిన ఎల్టీటీఈ టెర్రరిస్ట్ పాత్ర‌ విషయంలో తమిళులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తమిళ టైగర్లను చెడుగా చూపిస్తూ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు చూపిస్తున్నారన్నది వారి వాదన. దీనిపై వైగో అనే ఎంపీ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ‘ఫ్యామిలీ మ్యాన్-2’ ప్రసారం కాకుండా అడ్డుకోవాలని ఆయ‌న డిమాండ్ చేశాడు. ఇప్పుడు ఏకంగా త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం కూడా ఇదే బాట ప‌ట్ట‌డం సంచలనంగా మారింది. వైగో త‌ర‌హాలోనే కేంద్ర మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్‌కు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం త‌ర‌ఫున చీఫ్ సెక్ర‌ట‌రీ లేఖ రాశారు. ఫ్యామిలీ మ్యాన్ ట్రైల‌ర్ త‌మిళుల మ‌నోభావాలు దెబ్బ తీసేలా ఉందని, స‌మంత పోషించిన పాత్ర త‌మిళ టైగ‌ర్ల‌ను చెడుగా చూపించేలా క‌నిపిస్తోంద‌ని.. దీని ప‌ట్ల అన్ని రాజ‌కీయ ప‌క్షాల‌తో పాటు ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంద‌ని పేర్కొన్నారు. అందుకే జూన్ 4 నుంచి త‌మిళ‌నాడులోనే కాక‌.. దేశ‌వ్యాప్తంగా ఎక్క‌డా ఫ్యామిలీ మ్యాన్-2 ప్ర‌సారం కాకుండా అడ్డుకోవాల‌ని కోరారు. ఏకంగా ఒక రాష్ట్ర‌ ప్ర‌భుత్వం నుంచే ఇలాంటి లేఖ వచ్చింది కాబట్టి సిరీస్‌ను ఆపాల‌ని కేంద్రం ఆదేశాలు జారీ చేసినా ఆశ్చర్యం లేదు. సో మరి ఈ విషయం ఎందాకా వెళుతుందో వేచి చూడాలి.