Scene: ఈ రోజుల్లో స్టార్ హీరోల నుంచి ఒక సినిమా రావాలంటే కనీసం ఏడాదిన్నర లేదా రెండేళ్లు పడుతోంది. అలాంటిది కేవలం మూడు నెలల వ్యవధిలోనే వరుస సినిమాలతో థియేటర్లలో దిగిపోతూ తమిళ చిత్ర పరిశ్రమను విస్మయానికి గురిచేస్తున్నాడు సూర్య. గత కొన్నేళ్లుగా సరైన భారీ హిట్ లేక ఇబ్బంది పడ్డ ఆయన, ఇప్పుడు ఏకంగా ఒకే ఏడాది మూడు సినిమాలతో బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తుండటం చూసి తోటి హీరోలు సైతం నివ్వెరపోతున్నారు. మొదట ‘కరుపు’ (తెలుగులో ‘వీరభద్రుడు’)తో బాక్సాఫీస్ వద్ద పూనకాలు తెప్పించాడు. ఊరమాస్ రోల్లో అదరగొట్టి, కెరీర్లోనే మొట్టమొదటిసారి రూ. 300 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి అడుగుపెట్టాడు. ఆ జోష్ చల్లారకముందే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనే ఏజ్-గ్యాప్ లవ్ డ్రామాతో రెండో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా రూ. 90 కోట్లకు అమ్ముడైన ఆ సినిమా, రూ. 100 కోట్లకు పైగా షేర్, రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి బయ్యర్లకు లాభాల పంట పండించింది. ఇలా ఒకే ఏడాది కేవలం రెండు చిత్రాలతోనే రూ. 500 కోట్ల గ్రాస్ మార్కెట్‌ను తిరగరాసి తన స్టామినా ఏంటో నిరూపించాడు.
ఈ రెండు విజయాల పరంపరను హ్యాట్రిక్‌గా మలచుకునేందుకు దీపావళి వేళ ‘సీన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘ఆవేశం’ ఫేమ్ జీతు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నజ్రియా నజీమ్, నస్లీన్ గఫూర్లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఒక కేసు కోసం ఖాకీ డ్రెస్ వదిలేసి, సొంతంగా దర్యాప్తు చేసే తిక్కల పోలీస్ ఆఫీసర్‌గా సూర్య చూపించిన వేరియేషన్ ట్రైలర్ నుంచే అంచనాలు పెంచేసింది. కంటెంట్ కాస్త క్లిక్ అయినా, ఒకే ఏడాదిలో మూడు విజయాలు సాధించి తిరుగులేని హ్యాట్రిక్ రికార్డును ఆయన సొంతం చేసుకోవడం లాంఛనమే. ‘సీన్’ పూర్తయిందో లేదో, అప్పుడే రెస్ట్ తీసుకోకుండా ‘జై భీమ్’ దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ నిర్మిస్తున్న 48వ ప్రాజెక్ట్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లిపోయాడు. ఇందులో పోలీస్ పాత్ర నుంచి నేరుగా డాక్టర్ అవతారంలోకి మారిపోతున్నాడు. సూర్య వర్కింగ్ స్పీడ్, ప్రాజెక్టుల ఎంపిక చూస్తుంటే రాబోయే రోజుల్లో మిగతా స్టార్లకు అందనంత ఎత్తుకు చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

