Suraj Barjatya: వయెలెన్స్ మధ్య పాత ఫ్యామిలీ ఫార్ములా.. సూరజ్ బర్జాత్యా హిట్ కొట్టేనా?

Yeh Prem Mol Liya Suraj Barjatya

Yeh Prem Mol Liya Suraj Barjatya

ప్రస్తుతం బాలీవుడ్‌లో యాక్షన్, వయెలెన్స్ చిత్రాల హవా కొనసాగుతోంది. టాప్ హీరోల నుంచి మిడ్‌రేంజ్ హీరోల వరకు చాలామంది రక్తపాతం, భారీ యాక్షన్ సన్నివేశాలతో కూడిన కథలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. వయెలెన్స్ కాకుండా హారర్ థ్రిల్లర్లు, వార్ డ్రామాలు, బయోపిక్‌లు చేస్తున్నారు. అప్పుడప్పుడు ప్రేమకథలు తెరపైకి వస్తున్నప్పటికీ.. ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. ఇలాంటి సమయంలో సీనియర్ దర్శకుడు సూరజ్ బర్జాత్యా మాత్రం తనకు బాగా కలిసొచ్చిన కుటుంబ కథలు, ప్రేమ, అనుబంధాలు, విలువలతో కూడిన పాత ఫార్ములాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

దర్శకుడిగా సూరజ్ బర్జాత్యా తన ప్రయాణాన్ని ప్రారంభించి 37 ఏళ్లు గడిచాయి. అయితే ఈ సుదీర్ఘ కెరీర్‌లో ఆయన తెరకెక్కించిన సినిమాల సంఖ్య కేవలం ఎనిమిది మాత్రమే. తక్కువ సినిమాలే చేసినప్పటికీ.. ప్రతి చిత్రంలోనూ తనదైన ప్రత్యేక శైలిని కొనసాగించారు. కుటుంబ బంధాలు, ప్రేమ, భావోద్వేగాలు, సంప్రదాయ విలువలకు ఆయన కథల్లో పెద్దపీట వేస్తారు. కమర్షియల్ అంశాల కోసం అక్కడక్కడా యాక్షన్ సన్నివేశాలను జోడించినా.. భారీ స్థాయి హింసకు మాత్రం ఎప్పుడూ దూరంగానే ఉన్నారు. ‘మైనే ప్యార్ కియా’ నుంచి ‘ఉంచాయ్’ వరకు ఇదే పంథాను అనుసరిస్తూ వచ్చారు.

ఇప్పుడు సూరజ్ బర్జాత్యా తన తాజా చిత్రం ‘యో ప్రేమ్ మోల్ లియో’తోనూ అదే బాటలో పయనిస్తున్నారు. కుటుంబ బంధాలు, బంధుత్వాలు, భావోద్వేగాలకు ప్రాధాన్యతనిస్తూ.. కాస్త భిన్నమైన కథాంశంతో ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను రూపొందించారు. నవంబర్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో యాక్షన్, థ్రిల్లర్ సినిమాల జోరు కొనసాగుతున్న వేళ.. సూరజ్ తనదైన సున్నితమైన కథతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా ప్రేమ్ పాత్రలో కనిపించబోతున్నారు.