Site icon NTV Telugu

Sumaya Reddy: “మీ కోసం మీరు నిలబడకపోతే, ఎవరూ నిలబడరు!

Sumaya Reddy

Sumaya Reddy

తెలుగమ్మాయి సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా రూపొందించిన చిత్రం ‘డియర్ ఉమ’ ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో పృథ్వీ అంబర్ కథానాయకుడిగా నటించారు. సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట కెమెరామెన్‌గా, బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సంగీతం అందించిన రదన్ సంగీత దర్శకుడిగా పనిచేశారు. నగేష్ లైన్ ప్రొడ్యూసర్‌గా, నితిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.

ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో సుమయ రెడ్డి మాట్లాడుతూ, “అనంతపూర్ నుంచి వచ్చిన నేను ఈ స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉంది. మా ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా మీడియా నిలిచింది. కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి గుమ్మడికాయ కొట్టే వరకు సపోర్ట్ చేసిన మీడియాకు ధన్యవాదాలు. తెలుగమ్మాయిలు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి ఎక్కువగా వస్తున్నారు. నేను ఒక అడుగు ముందుకేసి ఈ సినిమాను నిర్మించాను. అందరూ నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను,” అని అన్నారు.

“నేను రాసి, తీసిన షార్ట్ ఫిల్మ్‌కు మంచి ఆదరణ లభించింది. ఆ తర్వాత సాయి రాజేష్‌తో కలిసి ‘డియర్ ఉమ’ చేశాం. నాకు అండగా నిలిచిన మధు, చక్రవర్తులకు ధన్యవాదాలు. నవీన్ గారి సహకారంతోనే రదన్ గారు మా ప్రాజెక్టులో చేరారు. ప్రతి ఒక్కరూ తమ డ్రీమ్ ప్రాజెక్ట్‌లా ఈ సినిమా కోసం కష్టపడ్డారు. ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉన్నట్లే, ప్రతి అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయి ఉంటాడు. నగేష్ ఈ ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి నాతో ఉన్నారు,” అని సుమయ రెడ్డి వివరించారు. “మీ కోసం మీరు నిలబడకపోతే, మీ కోసం ఎవరూ నిలబడరు. ఎంతో కష్టపడి ఈ సినిమాను ఇక్కడి వరకు తీసుకొచ్చాం. ఏప్రిల్ 18న ‘డియర్ ఉమ’ థియేటర్లలో విడుదల కానుంది. అందరూ చూసి మా చిత్రాన్ని విజయవంతం చేయండి,” అని అభిమానులను కోరారు.

Exit mobile version