Site icon NTV Telugu

ఇంతకూ ‘టైగర్ నాగేశ్వరరావు’ ఎవరు!?

మాస్ మహరాజా రవితేజ కెరీర్ ఇప్పుడు జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. ఈ యేడాది సంక్రాంతి బరిలో ‘క్రాక్’తో ఘన విజయం సాధించిన రవితేజ ఇప్పుడు ఏకంగా ఐదారు చిత్రాలను సెట్ చేశాడు. తాజాగా దీపావళి కానుకగా ఆయన కొత్త సినిమా… అదీ పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ ప్రకటన వచ్చింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తామంటున్నారు నిర్మాత అభిషేక్ అగర్వాల్. తమిళ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందించే ఈ సినిమాకు రచన, దర్శకత్వంలో వంశీ.

ఇంతవరకూ బాగానే ఉంది కానీ ఇప్పటికే టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ను తన కుమారుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో నిర్మించబోతున్నట్టు బెల్లంకొండ సురేశ్ ప్రకటించారు. కె. ఎస్.ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, మణిశర్మ సంగీత సారధ్యంలో ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రారంభిస్తానని ఈ యేడాది ఆగస్ట్ 11న బెల్లంకొండ సురేశ్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసి మరీ తెలిపారు. ‘స్టూవర్టుపురం దొంగ’ పేరుతో తెరకెక్కబోతున్న ఈ సినిమా 1987లో పోలీసుల కాల్పుల్లో మరణించిన, టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగానే ఉంటుందని అన్నారు. వెన్నెలకంటి బ్రదర్స్ రచన చేస్తున్న ఈ సినిమా తనకు కమ్ బ్యాక్ ఫిల్మ్ అని బెల్లంకొండ సురేశ్ అప్పటి ప్రకటనలో తెలిపారు. మరి ఇప్పుడు తాజాగా రవితేజ కూడా ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా ప్రకటనను విడుదల చేసిన నేపథ్యంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టారా? లేకపోతే రెండు సినిమాలు పోటాపోటీగా వస్తాయా? అనేది తేలాల్సి ఉంది.

Exit mobile version