SS Rajamouli on Varanasi Movie Story: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’. సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా.. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేష్, జక్కన్న కలయికలో వస్తున్న తొలి సినిమా కావడంతో అభిమానులు ఈ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
వారణాసి గురించి సోషల్ మీడియాలో ఏ చిన్న వార్త బయటకు వచ్చినా వెంటనే వైరల్ అవుతోంది. తాజాగా అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన ఎస్ఎస్ రాజమౌళి.. ఈ సినిమా కథ, అందులోని అంశాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ చిత్రం టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగుతుందని, అయితే సైన్స్ ఫిక్షన్ అంశాలకే పరిమితం కాకుండా భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యం ఉంటుందని వివరించారు. ‘వారణాసి సైన్స్ ఫిక్షన్లా అనిపించినప్పటికీ ఇందులో పౌరాణిక అంశాలతో కూడిన ఫాంటసీ కూడా ఉంటుంది. తండ్రీకొడుకుల అనుబంధంతో పాటు యువతీయువకుల మధ్య ప్రేమకథ కూడా సినిమాలో ప్రధాన భాగం’ అని జక్కన్న చెప్పారు.
వారణాసి సినిమా కథను తెరపైకి తీసుకురావడంలో ఎదురైన సవాళ్ల గురించి కూడా దర్శకధీరుడు రాజమౌళి మాట్లాడారు. ‘ఆరేడు సినిమాలను కలిపి ఒకే చిత్రంగా రూపొందించినట్లు వారణాసి ఉంటుంది. అయితే వాటన్నింటినీ ఒకే కథలో కలపడం ఈ సినిమాలో అతిపెద్ద సవాలుగా అనిపించింది. ప్రతి ఒక్కరికి మూవీ నచ్చుతుంది. అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు’ అని రాజమౌళి పేర్కొన్నారు. విభిన్నమైన కథాంశాలు, పౌరాణిక అంశాలు, టైమ్ ట్రావెల్, ప్రేమకథ, కుటుంబ భావోద్వేగాలను ఒకే చిత్రంలో చూపించనున్నట్లు రాజమౌళి వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. ఈ విభిన్న అంశాలన్నీ తెరపై ఎలా ఆవిష్కృతమవుతాయో తెలుసుకోవాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.

