SS Rajamouli-Mahesh Babu: బాబు సూపర్.. 100 అనుకుంటే 200 ఇచ్చారు!

Ss Rajamouli Mahesh Babu

Ss Rajamouli Mahesh Babu

SS Rajamouli Praises Mahesh Babu: సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు, దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’. టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ గ్లోబల్‌ అడ్వెంచర్‌ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా 2027 ఏప్రిల్‌ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రంలో మహేశ్‌ బాబు నటనపై జక్కన్న చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 100 శాతం అనుకుంటే 200 ఇచ్చారని ప్రశంసలు కురిపించారు. బాబుతో కలిసి పనిచేయడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అని రాజమౌళి పేర్కొన్నారు.

వారణాసిలో మహేశ్‌ బాబు తన పాత్రలో ఒదిగిపోయిన తీరు చూసి తాను ఆశ్చర్యపోయానని రాజమౌళి వెల్లడించారు. ఇటీవల ఓ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. మహేశ్‌ నటనపై జక్కన్న ప్రశంసలు కురిపించారు. బాబు సామర్థ్యం గురించి ముందే తెలుసని, అయితే కలిసి పనిచేయడం ప్రారంభించిన తర్వాత తన అంచనాలను మించి నటించారని చెప్పారు. ‘మహేశ్‌ సామర్థ్యం నాకు ముందే తెలుసు. కానీ ఆయనతో పనిచేయడం మొదలుపెట్టాక.. నా అంచనాలకు మించి నటించారు. నేను ఊహించినదానికంటే రెండు వందల శాతం ఇచ్చారు. తన పాత్రలో ఒదిగిపోయి ప్రాణం పోశారు. అది చూసి ఆశ్చర్యపోయాను’ అని జక్కన్న చెప్పుకొచ్చారు.

వారణాసి చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. దాదాపు 10 రోజుల షూటింగ్‌ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే అక్టోబర్‌ నాటికి షూటింగ్‌ పూర్తయ్యే అవకాశం ఉంది. అనంతరం నవంబర్‌ నుంచి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండటంతో.. ప్రచార కార్యక్రమాలను కూడా దశలవారీగా ప్రారంభించేందుకు చిత్రబృందం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మహేశ్‌ బాబు, రాజమౌళి కలయికలో వస్తున్న తొలి సినిమా కావడంతో వారణాసిపై అంచనాలు భారీగా ఉన్నాయి. టైమ్‌ ట్రావెల్‌, అడ్వెంచర్‌, పౌరాణిక అంశాల మేళవింపుతో ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.