Sridevi Biography: భారతీయ చలనచిత్ర పరిశ్రమ మొదటి మహిళా సూపర్ స్టార్, దివంగత నటి శ్రీదేవి జయంతి (ఆగస్టు 13) సందర్భంగా ప్రముఖ రచయిత ధీరజ్ యు. కుమార్ రాసిన ‘ఎంప్రెస్ – ది డెఫినిటివ్ బయోగ్రఫీ ఆఫ్ శ్రీదేవి’ (Empress: The Definitive Biography of Sridevi) అనే జీవిత చరిత్ర పుస్తకానికి సంబంధించిన కీలక అప్‌డేట్‌ను బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ బుక్ కవర్ పేజీని సోషల్ మీడియాలో ఆమె పంచుకున్నారు. కేవలం 4 ఏళ్ల వయసులోనే బాలనటిగా కెరీర్ ప్రారంభించి, తెలుగు, హిందీ, తమిళం వంటి పలు భాషల్లో దాదాపు 300 చిత్రాలలో నటించి తిరుగులేని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న శ్రీదేవి జ్ఞాపకాలను ఈ పుస్తక ప్రకటనతో పాటు ఆమె రాబోయే బయోపిక్ గురించిన చర్చలు చిత్ర పరిశ్రమలో మళ్లీ గుర్తుచేశాయి.
వెండితెరపై ఎన్నో చిరస్మరణీయ పాత్రలతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు ఈ దిగ్గజ నటి. ధీరజ్ కుమార్ రచించిన ఆమె జీవితచరిత్రను వెస్ట్‌ల్యాండ్ బుక్స్ ప్రచురిస్తోంది. బాలనటిగా మొదలైన శ్రీదేవి ప్రయాణం, భారతీయ సినిమా తొలి నిజమైన పాన్ ఇండియా మహిళా స్టార్‌గా ఎదిగిన కథను ఈ పుస్తకం విస్తృతంగా వివరిస్తుంది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఐదు దశాబ్దాల పాటు సాగిన ఆమె సినీ ప్రయాణం, 300కు పైగా చిత్రాల్లో చేసిన నటన ఈ పుస్తకంలో ప్రధానంగా ప్రస్తావించబడింది.
హీరోల ఆధిపత్యం ఉన్న కాలంలో తన ప్రతిభతోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న శ్రీదేవి ఎదుగుదలను ఈ పుస్తకం విశ్లేషించనుంది. ఆమె భారతీయ సినిమాపై చూపిన ప్రభావాన్ని మాత్రమే కాదు, ఇప్పటివరకు పెద్దగా వెలుగులోకి రాని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలను కూడా ఇందులో పొందుపరిచారు. ఇండియన్ సినీ హిస్టరీలో ఆమె కెరీర్ ఎలా కీలక మలుపులు తిరిగిందనే విషయాన్ని కూడా రచయిత వివరించినట్లు ప్రచురణకర్తలు తెలిపారు.
ఈ పుస్తకంలోని మరో ప్రత్యేక ఆకర్షణ 150కు పైగా అరుదైన ఫోటోలు. వీటితో పాటు అమితాబ్ బచ్చన్, జావేద్ అక్తర్ ప్రత్యేక రచనలు కూడా ఇందులో చోటు చేసుకున్నాయి. రచయిత ధీరజ్ కుమార్‌కు శ్రీదేవితో వ్యక్తిగత పరిచయం ఉండటం ఈ పుస్తకానికి మరింత విశ్వసనీయతను తీసుకొచ్చిందని భావిస్తున్నారు. ఆమె భర్త బోనీ కపూర్ అందించిన సహకారం, అరుదైన ఫోటోలు, వివిధ భాషల సినీ ప్రముఖులు పంచుకున్న జ్ఞాపకాలు ఈ జీవితచరిత్రను మరింత సమగ్రంగా తీర్చిదిద్దాయి.
2018లో 54 ఏళ్ల వయసులో కన్నుమూసిన శ్రీదేవి ఇప్పటికీ భారతీయ సినిమా గొప్ప నటీమణుల్లో ఒకరిగా గుర్తింపు పొందుతున్నారు. ‘హిమ్మత్‌వాలా’, ‘మిస్టర్ ఇండియా’, ‘చాందినీ’, ‘చాల్‌బాజ్’, ‘లమ్హే’, ‘ఖుదా గవా’, ‘జుదాయి’, ‘ఇంగ్లీష్ వింగ్లీష్’, ‘మామ్’ వంటి చిత్రాలతో ఆమె సృష్టించిన మాయ ఇప్పటికీ కొనసాగుతోంది. 2026 చివరిలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ‘ఎంప్రెస్’ పుస్తకం, శ్రీదేవి జీవితాన్ని కొత్త కోణంలో తెలుసుకోవాలనుకునే అభిమానులకు ఒక ప్రత్యేక అనుభవంగా నిలవనుంది. త్వరలోనే ఈ బయోగ్రఫీ రాబోతుండటంతో, భవిష్యత్తులో దీని ఆధారంగానే సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు కూడా ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్నాయి. శ్రీదేవి బయోపిక్ పై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

