ఒక్కోసారి అభిమానులు సెలబ్రెటీలను చాలా విసిగిస్తారు. వారిని ఇబ్బందులు పెడుతుంటారు. ఇటీవల బెంగళూరులో నిర్వహించిన ఓ సంగీత కచేరీలో ప్రముఖ గాయకుడు సోనూనిగమ్ పై తన అభిమాని చేసిన రచ్చ అంత ఇంత కాదు. దీంతో భాషా విద్వేషాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ సోనూనిగమ్ పై కన్నడ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘కర్ణాటక రక్షణ వేదిక – బెంగళూరు సిటీ యూనిట్’ అధ్యక్షుడు ధర్మరాజ్ ఫిర్యాదు చేయడంతో సోనూనిగమ్‌పై కేసు నమోదైంది. ఈ ఘటనపై స్పందించిన బెంగళూరు పోలీసులు సోనూనిగమ్‌కు నోటీసులు జారీ చేశారు. ఒక వారం లోగా విచారణకు హాజరు కావాలని సూచించారు. అంతే కాదు..
‘కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ ఆయన పై తాత్కాలికంగా బ్యాన్ విధించిందట. కాగా ఈ వివాద నేపథ్యంలో సోనూనిగమ్ తాజాగా సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు.. ‘నిజాయితీగా చెప్పాలంటే, కర్ణాటక రాష్ట్రం, కన్నడ భాష, సంస్కృతి, కళాకారుల పై నాకు ఎంతో ప్రేమ అలాగే గౌరవం కూడా ఉంది. హిందీ కన్నా ఎక్కువగా నేను కన్నడ పాటలే ఆస్వాదిస్తాను. ప్రతి బేంగళూరు షోకు ముందుగా ఎక్కువ సమయాన్ని కన్నడ పాటల ప్రాక్టీస్‌కే కేటాయిస్తాను. అలాంటిది నా వయసుకు సగం ఉండే ఓ వ్యక్తి అర్థం లేని విధంగా వేలాదిమంది ముందే గౌరవం లేకుండా బెదిరించటం నన్నెంతో బాధించింది. ‘షో ఇప్పుడే మొదలైంది, ప్లాన్ ప్రకారం షో కొనసాగుతుంది’ అని అతనికి మర్యాదగా సమాధానం చెప్పాను. ముందుగానే సెలెక్ట్ చేసిన పాటల జాబితా ప్రకారం గాయకులు, టెక్నీషియన్లు సిద్ధంగా ఉంటారు. ఒక్కసారిగా వేరే పాటలు పాడమంటే సాధ్యం కాదు టెక్నీషియన్లు ఇబ్బంది పడతారు’ అని పేర్కొన్నారు.
