Vijay Sethupathi’s Slum Dog Glimpse Out:మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్’. ఈ సినిమాపై ఇప్పటికే ఆసక్తి నెలకొనగా.. తాజాగా మేకర్స్ మరో కీలక అప్‌డేట్‌ను పంచుకున్నారు. సీనియర్ నటి జరీనా వహాబ్ ఈ సినిమాలో ‘జుబైదా’ అనే కీలక పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ‘జుబైదాగా జరీనా వహాబ్’ అంటూ మూవీకి సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేశారు.
ఒక నిమిషం 17 సెకండ్ల నిడివి ఉన్న ఈ గ్లింప్స్ భావోద్వేగభరితంగా సాగింది. ‘నాంపల్లి స్టేషన్‌కు వెళ్లి ట్రైన్ కింద తలపెట్టి చచ్చిపోదాం అనుకున్నాను.. కానీ ధైర్యం సరిపోలేదు’ అనే డైలాగ్‌తో గ్లింప్స్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఆకలి, పేదరికం, నిస్సహాయత చుట్టూ తిరిగే జరీనా వహాబ్ పాత్ర తాలూకు భావోద్వేగాలను చూపించారు. ‘ఈ ఆకలి ముందు అన్ని ఓడిపోతాయి రా.. సిగ్గు, లజ్జ, మానం, మర్యాద అన్నీ మంటకలిసిపోతాయి’, ‘నాకు తెలియకుండానే నా చేతులు అడుక్కోవడం మొదలుపెట్టాయి’, ‘అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి.. అడుక్కోవడానికి కాదు’ వంటి డైలాగ్స్ గ్లింప్స్‌లో ప్రత్యేకంగా నిలిచాయి. ముఖ్యంగా చివరి డైలాగ్ పాత్రలోని బాధను, తల్లి భావోద్వేగాన్ని బలంగా చూపిస్తోంది. జరీనా వహాబ్ నటన గ్లింప్స్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ఇక స్లమ్ డాగ్ సినిమాలో విజయ్ సేతుపతికి జోడీగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. సీనియర్ నటి టబు కీలక పాత్రలో కనిపించనున్నారు. విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. పూరి జగన్నాథ్ మార్క్ టేకింగ్‌కు తోడు విజయ్ సేతుపతి, సంయుక్త మీనన్, టబు, జరీనా వహాబ్ వంటి నటీనటుల కలయిక సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. తాజాగా విడుదలైన జరీనా వహాబ్ గ్లింప్స్ సినిమాకు సంబంధించిన కథ, పాత్రలు, భావోద్వేగాలపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. త్వరలోనే థియేటర్లోకి వస్తుంది అని మేకర్స్ పేర్కొన్నారు.

