టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ ఇటీవల మహిళల డ్రెస్సింగ్ స్టైల్‌ను ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయి. దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల దుస్తుల గురించి ఆయన మాట్లాడిన తీరు కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ దృష్టికి చేరింది. ఈ విషయాన్ని కమిషన్ అత్యంత తీవ్రంగా పరిగణించింది. నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద స్పందించారు. శివాజీ వాడిన పదజాలం, ఆయన ప్రసంగం వెనుక ఉన్న ఉద్దేశాలను విశ్లేషించే బాధ్యతను కమిషన్‌లోని లీగల్ టీమ్‌కు అప్పగించినట్లు ఆమె తెలిపారు.
Also Read :Shivaji : ‘బూతు’ వ్యాఖ్యలపై కమల్ కామరాజు సంచలన కౌంటర్..చూసే కళ్లలోనే ఉంది దరిద్రం..!
శివాజీ మాట్లాడిన పూర్తి వీడియో ఫుటేజీని అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్న ప్రతి పదాన్ని చట్టపరంగా విశ్లేషిస్తున్నారు. చట్టం ముందు ఎవరైనా సమానమేనని, సెలబ్రిటీ హోదా ఉన్నంత మాత్రాన మహిళలను కించపరిచేలా మాట్లాడితే ఊరుకోబోమని చైర్‌పర్సన్ స్పష్టం చేశారు. కేవలం నోటీసులతోనే సరిపెట్టకుండా, శివాజీపై కఠినమైన చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను, వారి డ్రెస్సింగ్ ఎంపికను తప్పుబడుతూ సమాజంలో తప్పుడు సంకేతాలు పంపినందుకు ఆయనపై కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రసంగంలో ఆయన వాడిన “దరిద్రపుగొట్టు, సామాన్లు…” వంటి పదజాలం మహిళా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
