Sharwanand: నన్ను కూడా సీఎంను చేస్తారా?.. హీరో శర్వానంద్ కీలక వ్యాఖ్యలు!

Sharwanand Narsanna Conversation

Sharwanand Narsanna Conversation

Hero Sharwanand, Singer Narsanna Funny Comments : శర్వానంద్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన చిత్రం ‘భోగి’. సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కె.కె. రాధామోహన్‌ నిర్మించారు. గ్లామర్ డాల్ డింపుల్‌ హయాతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ నెల 27న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి చిత్రబృందం భోగి మ్యూజికల్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సినిమాలోని ‘గంగ’ పాటను విడుదల చేశారు.

గంగ పాటను ప్రముఖ జానపద గాయకుడు నల్గొండ గద్దర్‌ అలియాస్‌ నర్సన్న ఆలపించారు. పాట విడుదల కార్యక్రమానికి నర్సన్న కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో శర్వానంద్‌, నర్సన్న మధ్య జరిగిన సరదా సంభాషణ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా బృందంలోని సభ్యుల గురించి మాట్లాడిన శర్వా.. నర్సన్న ప్రస్తావనకు వచ్చేసరికి తనదైన శైలిలో చమత్కరించారు. ‘నర్సన్న.. మీరు చాలామందిని సీఎంలను చేశారంట. భోగిలో పాట పాడారు కదా.. మరి నన్ను కూడా సీఎం చేస్తారా? విజయ్‌ లాగా’ అంటూ సరదాగా ప్రశ్నించారు. అందుకు నర్సన్న స్పందిస్తూ.. ‘చెప్పలేం అన్నా.. నిజంగా సీఎం అవుతారేమో. దేవుడు అనుకుంటే సీఎం అవుతారు’ అని బదులిచ్చారు.

నర్సన్న వ్యాఖ్యలపై శర్వానంద్‌ స్పందిస్తూ… ‘లేదు.. నేను నటుడిగా హ్యాపీగా ఉన్నాను. అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తున్నా. ఇది చాలు’ అని నవ్వుతూ చెప్పారు. దీంతో ఈవెంట్‌లో సందడి నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖ రాజకీయ నాయకుల కోసం నర్సన్న గతంలో పొలిటికల్ పాటలు పాడారు. చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌, రేవంత్‌ రెడ్డి తదితర నేతలపై ఆయన ఆలపించిన పాటలు ప్రజల్లోకి వెళ్లాయి. ముఖ్యంగా 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రస్తుత సీఎం రేవంత్‌ రెడ్డి కోసం పాడిన పాటతో నర్సన్నకు మంచి గుర్తింపు వచ్చింది. ఆయన పాటలు పాడిన నేతలు ముఖ్యమంత్రులు అయ్యారు. ఈ నేపథ్యంలోనే శర్వానంద్‌ ఆయనను ఉద్దేశించి సరదాగా ఈ వ్యాఖ్యలు చేశారు.